తిరుపతి మంగళం : డీఎస్సీ–2025 అక్రమాలపై శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టనున్నట్టు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు రావాలని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు గురువారం చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నారా లోకేష్ విద్యాశాఖామంత్రిగా ఉండి విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డితో పాటు విద్యార్థి విభాగం నాయకులు ఓబుల్‌రెడ్డి ఉన్నారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ కృష్ణ తేజ అతిథిగృహం వద్దకు చేరుకుంది. బుధవారం అర్ధరాత్రి వరకు 87,691 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 49,958 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.99 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
దళిత నాయకుడిపై దాడి
– మహానాడులో ఉద్రిక్తత
వరదయపాళ్యం: పిచ్చాటూరులో నిర్వహించిన మహానాడు సమావేశంలో దళిత నాయకుడిపై దాడి జరగడం ఉద్రిక్తతకు దారితీసింది. పల్లికొండేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్ పద్మనాభరాజు నివాసంలో జరిగిన సమావేశానికి మండలంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఇందులో అడవికొడియంబేడు దలళితవాడకు చెందిన టీడీపీ తిరుపతి పార్లమెంటరీ ఎస్సీసెల్ కార్యదర్శి రవిపై తిరుపతి పార్లమెంటు టీడీపీ మాజీ ఉపాధ్యక్షులు కె.సతీష్‌నాయుడు, పిచ్చాటూరు మాజీ టీడీపీ మండల అధ్యక్షుడు ఎం.తిరుమలైరెడ్డి వర్గీయులు దాడి చేశారు. రవిని కొట్టడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో దూషించారు. అదే సమయంలో పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పద్మనాభరాజు సోదరుడు లక్ష్మణరాజు కూడా రవిని దూషిస్తూ ఇంటి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించాడు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వరరావుకు రవి తన సమస్యను వివరిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో సమావేశ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది.
3న మేనేజర్ పోస్టులకు పరీక్ష
తిరుపతి అన్నమ్యసర్కిల్: తిరుపతి ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్ట్‌కు జూన్ 3న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, శ్రీకాళహస్తి ఈ–డివిజనల్ మేనేజర్ పోస్ట్‌కు అదే రోజు మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ – పీజీ కాలేజీలో పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ కారాలయ అధికారవర్గాలు తెలిపాయి.


