రోడ్డు భద్రతకు హైటెక్ చర్యలు రాష్ట్రంలో తొలిసారి 10 వేల రాపిడ్ టెస్టింగ్ కిట్లు పంపిణీ ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక భద్రతా పరికరాలు అందజేత
తిరుపతి క్రైం : తిరుపతి జిల్లాను ప్రమాద రహితంగా, గంజాయి రహితంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో రోడ్డు భద్రత, గంజాయి నిర్మూలనపై బుధవారం తిరుపతి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలోని పరేడ్ గ్రౌండ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు సంయుక్తంగా ట్రాఫిక్, హైవే మొబైల్ వాహనాలు, గంజాయి నిర్ధారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మొబైల్ బస్సును పరిశీలించారు. జిల్లాలోని 11 రోడ్ సేఫ్టీ మొబైల్ వాహనాలకు సేఫ్టీ కోన్‌సం, రిఫ్లెక్టివ్ జాకెట్లు, రేడియం స్టిక్కర్లు, ట్రాఫిక్ బాటమ్ లైట్లు తదితర ఆధునిక భద్రతా పరికరాలను అందజేశారు. ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి కూలింగ్ గ్లాసులు, నీళ్ల బాటిళ్లు, రేడియం జాకెట్లు, బాటన్ లైట్లు పంపిణీ చేశారు. జాతీయ రహదారులపై గుర్తించిన 43 బ్లాక్ స్పాట్ల వద్ద భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు. హైవే మొబైల్ వాహనాల ద్వారా నిరంతర పెట్రోలింగ్ నిర్వహిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
గంజాయి నిరోధానికి ప్రత్యేక బస్సులు
రాష్ట్రంలోనే తొలిసారిగా తిరుపతి జిల్లాలో 10 వేల రాపిడ్ గంజాయి టెస్టింగ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్పీ తెలిపారు. ఇప్పటికే 4 వేల కిట్లను అన్ని సబ్ డివిజన్లకు పంపిణీ చేసినట్లు చెప్పారు. యూరిన్ శాంపిళ్ల ఆధారంగా ఐదు నిమిషాల్లో ఫలితాలు వెల్లడించే ఈ కిట్లతో గంజాయి వినియోగదారులను గుర్తించనున్నారు. ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక మొబైల్ బస్సు ఏర్పాటు చేసి గంజాయి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తొలిసారి పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వగా, పదేపదే గంజాయి వినియోగం నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
స్మగ్లర్లపై కఠిన చర్యలు
గంజాయి వినియోగదారుల ద్వారా రవాణాదారుల వివరాలు సేకరించి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. గత నెలలోనే 4,500 కిలోల గంజాయిని ధ్వంసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. గంజాయి నేరస్తులపై ప్రత్యేక షీట్లు తెరిచినట్లు పేర్కొన్నారు. గంజాయి, ఎరచ్రందనం స్మగ్లింగ్, రౌడీషీటర్లపై గత రెండేళ్లలో 37 పీడీ కేసులు నమో దు చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవి మనోహరాచారి (శాంతి భద్రతలు), ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, వివిధ సబ్ డివిజన్ అధికారులు, ఆర్టీవోలు, సీఐలు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.


