– ఉరి వేసుకుని మహిళ మృతి
చంద్రగిరి:ప్రియుడు వదిలేశాడని ఉరి వేసుకుని మహిళ మృతి చెందిన ఘటన తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. బీహార్‌కు చెందిన తిట్లీదేవి(40) రెండున్నరేళ్ల క్రితం భర్తను వదిలేసి, ప్రియుడితో పారిపోయి తిరుపతికి చేరుకుని సహజీవనం చేస్తోంది. ఈ క్రమంలో ఇద్దరూ కలసి ముళ్లపూడి వద్ద ఓ డెయిరీ ఫాంలో కూలీలుగా పనిచేస్తున్నారు. గత పది రోజులు క్రితం ప్రియుడు, తిట్లీదేవిని వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి లోనయ్యింది. మంగళవారం రాత్రి డెయిరీ ఫాం వద్ద ఎవరూ లేని సమయంలో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం డెయిరీ నిర్వాహుకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తిట్లీదేవి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ సుధాకర్ పేర్కొన్నారు.
తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిపై వేటు
చంద్రగిరి: లైంగిక వేధింపుల కారణంగా తిరుచానూరు పంచాయతీ కార్యదర్శి మణిపై కలెక్టర్ వెంకటేశ్వర్ చర్యలు తీసుకున్నారు. ఇటీవల కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగనిపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తిరుచానూరు పంచాయతీ కార్యదర్శిగా మణిని విధుల నుంచి తప్పించారు. ఆయన స్థానంలో ఇన్‌చార్జ్ ఈవోగా తిరుపతి రూరల్ ఈఓపీఆర్డీ దయా సాగర్‌ను నియమించారు.
సైన్స్ ఆవిష్కరణలో ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతం
– డల్హౌసీ యూనివర్సిటీతో
తిరుపతి ఐసర్ ఎంవోయూ
ఏర్పేడు: సైన్స్ రంగంలో నూతన ష్కరణలు, పరిశోధనలకు ప్రపంచ భాగస్వామ్యాల బలోపేతం ఎంతైనా అవసరమని తిరుపతి ఐసర్ డైరెక్టర్ ప్రొఫెసర్ శాంతను భట్టాచార్య అన్నారు. పరిశోధన, స్టార్టప్‌లు, ఆవిష్కరణ, పరిశ్రమ భాగస్వామ్యాలలో భారత్–కెనడా సహకారం మరింత పెంచే వ్యూహాత్మక కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఐసర్, కెనడా దేశం హాలీఫాక్‌సలోని డల్హౌసీ యూనివర్సిటీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. తిరుపతి ఐసర్ డైరెక్టర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెనడాలోని డల్హౌసీ యూనివర్సిటీలో క్రియేటీవ్ డిస్ట్రక్షన్ ల్యాబ్–అట్లాంటిక్ ఆవిష్కరణ సెషన్‌లలో పాల్గొన్నారు. ఐసర్ డైరెక్టర్, డల్హౌసీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నోని మెక్‌డొనాల్డ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. తొలి తిరుపతి–డాల్హౌసీ ఇన్నోవేషన్ రీసెర్చ్ రౌండ్ టేబుల్‌ను ప్రారంభించారు. తిరుపతిలోని ట్రినిస్టిట్యూషనల్ గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాంపస్‌పై చర్చించారు. ఏఐ, డిజిటల్ సిస్టమ్‌లు, ఆరోగ్య సాంకేతికతలు, అధునాతన మెటీరియల్స్, వ్యవసాయం, కీలకమైన ఖనిజాలతో భారతదేశం, కెనడా దేశాల సైన్స్ ప్రగతి, నూతన ఆవిష్కరణలకు సరికొత్త అధ్యాయానికి ఈ ఒప్పందం బీజం వేసిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.


