తిరుపతి రూరల్: డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకుందున్న సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగంతో పాటు మిగతా విద్యార్థి సంఘాలను కలుపుకుని ఈనెల 29న జరిగే ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే ధర్నాకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నేతలు తరలిరావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమవడంతోపాటు డీఎస్సీ ఉద్యోగ నియామకాల్లో అర్హులైన వారికి న్యాయం జరగలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ఆయన మంత్రి పదవిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టే ఆందోళనకు ప్రతి ఒక్కరూ తరలిరావాలన్నారు.


