ఇదేనా పొదుపు బాబూ!
టీడీపీ చేపట్టిన వర్చువల్ మహానాడు ఖర్చులు తడిసి మోపెడయ్యాయని తమ్ముళ్లు లబోదిబో మంటున్నారు. ఈ ఖర్చులు ఎమ్మెల్యేలు భరించాల్సి ఉన్నా.. కొందరు మండల పార్టీ నాయకులు, వ్యాపార వేత్తలకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇంధన పొదుపు పేరుతో చేపట్టిన వర్చువల్ మహానాడు తమ జేబులకు చిల్లుపడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ మహానాడు కాకుండా.. ముందుగా అనుకున్నట్లు నెల్లూరులో నిర్వహించి ఉంటే తమపై ఖర్చుల భారం పడేది కాదని టీడీపీ శ్రేణులు చెబుతున్నారు.
అధికారమా.. మజాకా?
వర్చువల్ మహనాడు కార్యక్రమం కేవలం పార్టీ కార్యక్రమమే. అయితే కొందరు నాయకులు అధికారాన్ని ఉపయోగించుకున్నారు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాణిలో ప్రభుత్వ మండల పరిషత్ కార్యాలయంలో మహానాడు నిర్వహించి ఔరా అనిపించారు. అదే విధంగా చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని గుడిపాలలో టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించడం గమనార్హం.
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి, చిత్తూరు జిల్లాలో బుధవారం అన్ని మండల కేంద్రాలతో పాటు సూళ్లూరుపేట, వెంకటగిరి, శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం మున్సిపాలిటీలతో పాటు చిత్తూరు, తిరుపతి నగరాల్లో నాలుగు డివిజన్లకు ఒక చోట వర్చవల్ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి నగరంలో 12 చోట్ల, చిత్తూరులో ఐదు చోట్ల మినీ మహానాడు నిర్వహించారు. ప్రతి క్లస్టర్‌లో నాయకులు, కార్యకర్తలు వీక్షించేందుకు డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అదే విధంగా మహానాడుకు హాజరైన వారందరికీ భోజన వసతులు ఏర్పాటు చేశారు. అనేక చోట్ల చికెన్ బిరియాని ఏర్పాటు చేశారు.
శ్రీరంగరాజపురంలో..
చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం తయ్యూరు పాయికట్టు ఆరిమాకులపల్లిలో వెలసిన శ్రీఆరిమానిగంగమ్మ ఆలయం వద్ద బుధవారం టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోనే వేదిక ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆలయం ఆవరణ చుట్టూ, గాలి గోపురం వద్ద, ఆలయం ఎదురుగా రోడ్డుపై టీడీపీ జెండాలు, తోరణాలు ఏర్పాటుచేశారు.
దొరవారిసత్రంలో..
తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని సింగనాలత్తూరులో ప్రభుత్వ పాఠశాలలో మినీ మహానాడు నిర్వహించారు.
స్పందన కరువు
వర్చువల్ మహానాడు కార్యక్రమానికి అనేక మండలాల్లో స్పందన కరువైంది. అధిష్టానం ఆదేశాలని చెప్పి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మండల పార్టీ నాయకులపై ఒత్తిడి చేసి నిర్వహించిన కార్యక్రమాలకు పార్టీ శ్రేణులందరూ హాజరుకాలేదు. అందుబాటులో ఉన్న వారిని మాత్రం పిలిపించుకుని మమ అనిపించిన కార్యక్రమాలు ఉన్నాయి. భారీగా చేసిన వర్చువల్ మహానాడు కార్యక్రమాలు ఉన్నాయి.
ద్వితీయ శ్రేణి నాయకులపైనే భారం
తిరుపతి, చిత్తూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలే వర్చువల్ మహానాడు ఖర్చులు భరించారు. ఎక్కువ శాతం మండల పార్టీ నాయకుల మహానాడు ఖర్చును భరించాల్సి వచ్చిందని చెబుతున్నారు. తిరుపతి, చిత్తూరు నగరాల్లో కొందరు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, జిల్లా స్థాయి నాయకులు ఖర్చులు భరించారు. అదే విధంగా తుడా చైర్మన్ డాలర్ దివాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కూడా మహానాడు నిర్వహణకు సొంత డబ్బులు ఖర్చుచేసినట్లు తెలిసింది. కార్యకర్తల తరలింపునకు కూడా జేబులో నుంచి ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పదువులు పొందిన వారు, సంపాదించుకున్నోళ్లు పెట్టినా ఇబ్బంది లేదు కానీ, ఎటువంటి ప్రయోజనం పొందని వారి నుంచి కూడా వసూళ్లు చేయడం, ఖర్చు చేయించడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వర్చువల్ మహానాడు కార్యక్రమానికి కొందరు రూ.లక్ష ఖర్చు చేస్తే.. మరి కొందరు రూ.5 లక్షలు ఖర్చు చేసిన నాయకులు ఉన్నారు.


