బుచ్చినాయుడుకండ్రిగ: అనారోగ్య సమస్యలు తాళలేక పురుగుల తాగి ఆత్మాహత్య పాల్పడిన సంఘటన బుచ్చినాయుడుకండ్రిగలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ హరిప్రసాద్ కథనం మేరకు.. బుచ్చినాయుడుకండ్రిగ అరుంధతివాడకు చెందిన బట్టేపాటి దశయ్య (50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గత 24వ తేదీ అర్ధరాత్రి పురుగుల నివారణ మందు తాగాడు. ఇది గమనించిన భార్య మంగమ్మ, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించారు. మృతుడి కుమారుడు విష్ణువర్థన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
ముక్కంటి సేవలో
హైకోర్టు న్యాయమూర్తి
శ్రీకాళహస్తి: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య కుటుంబ సమేతంగా మంగళవారం జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద ఈఓ బీకే వెంకటేశులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా వారు ప్రత్యేక రాహుకేతు పూజలను చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. మృత్యుంజయస్వామి సన్నిధి వద్ద వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు.
తిరుత్తణి ఆలయంలో
ఆంధ్రా మహిళ వాచ్ చోరీ
తిరుత్తణి: తిరుత్తణి మురుగన్ ఆలయంలో స్వామి దర్శనానికి క్యూలైన్‌లో వెళ్లిన ఆంధ్రాకు చెందిన మహిళ వద్ద ఖరీదైన వాచ్ చోరీకి గురైంది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి శ్రీరామ్‌నగర్‌కు చెందిన రాజేంద్రప్రసాధ్ కుటుంబంతో కలిసి మంగళవారం ఉదయం తిరుత్తణికి వచ్చింది. ఆలయ మాడ వీధిలో రూ.100 ప్రత్యేక దర్శన క్యూలైన్‌లో కుమారుడు దినేష్, కోడలు శ్వేతతో కలిసి రాజేంద్రప్రసాద్ స్వామి దర్శానికి వెళ్లారు. ఆ సమయంలో శ్వేత (32) చేతికి కట్టుకున్న బంగారు, వజ్రపు రాళ్లు పొదిగిన రూ. 7 లక్షల విలువైన చేతి వాచ్ అదృశ్యమైంది. వాచ్ చోరీపై రాజేంద్రప్రసాద్ తిరుత్తణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్పెక్టర్ శివకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి ఆలయంలో మహిళ వద్ద ఖరీదైన వాచ్ వినూత్న రీతిలో అదృశ్యం ఘటన కలకలం రేపింది.
దారి ఆక్రమణ
రేణిగుంట: మండలంలోని గురవరాజుపల్లి పంచాయతీ వైఎస్సార్ నగర్‌లో స్థానిక టీడీపీ నాయకుడు దారి ఆక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ కారణంగా ఆ వీధిలో కాలువ లేకపోవడంతో పైనుంచి వచ్చే మురుగు నీరంతా ఇళ్ల మధ్య నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీలో మొత్తం 20 అడుగుల దారి ఉంటే ఇక్కడ మాత్రం కనీసం ఆరడుగులు దారి కూడా లేకుండా ఆక్రమణకు పాల్పడినట్లు స్థానికులు వాపోతున్నారు. కాపురాలు ఉండే ప్రదేశంలో మురుగునీరు నిల్వ ఉండడంతో ఎక్కడ అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయో? అని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులకు పలుమార్లు సమస్య తెలిపినా టీడీపీ నాయకుడికి భయపడి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఉన్నతాధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనం
రేణిగుంట: పట్టణంలోని రైల్వే అండర్ బ్రిడ్జి మరమ్మతులు చేసేందుకు నెలరోజుల పాటు మూసివేశారు. అయినప్పటికీ అధికారుల సమన్యయ లోపంతో ఎక్కడ పనులు అక్కడే వదిలేసి యథావిధిగా వాహనాల రాకపోకలను కొనసాగించారు. నెల రోజుల వ్యవధిలో అండర్ బ్రిడ్జి వద్ద వర్షపునీరు వెళ్లేందుకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం కురిసిన వర్షానికి అండర్ బ్రిడ్జిలో నీళ్లు రావడంతో వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరమ్మతుల కోసం నెల రోజులు బ్రిడ్జిను మూసేసిన అధికారులు వర్షపు నీళ్ళు వెళ్లేందుకు చర్యలు తీసుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉందని వాహనచోదకులు వాపోతున్నారు.


