పిడుగుపాటుకు యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు యువకుడి మృతి

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

టౌన్‌: మండలంలో మంగళవారం సాయంత్రం పిడుగుపాటుకు ఓ యువకుడు మృతి చెందాడు. మండలంలోని కారుమంచువారి కండ్రిగ సమీపంలో కొందరు యువకులు క్రికెట్‌ ఆడుతుండగా తొప్పాని యశ్వంత్‌ (26) సమీపంలో అకస్మాత్తుగా పిడుగు పడడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు హుటాహుటిన పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అప్పటికే యశ్వంత్‌ మృతి చెందినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. యఽశ్వంత్‌ డిప్లొమా వరకు చదివి ఉద్యోగం కోసం చూస్తున్నాడు. యశ్వంత్‌ మృతితో తల్లిదండ్రులు రవికుమార్‌, లతతో పాటు కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

పిడుగు పడి.. కొబ్బరిచెట్టులో మంటలు

నాయుడుపేట టౌన్‌: పట్టణంలోని ఎల్‌ఏ సాగరం గిరిజన కాలనీలోని ఓ కొబ్బరి చెట్టుపై మంగళవారం పిడుగుపడింది. దీంతో కొబ్బరి చెట్టుపై మంటలు చెలరేగాయి. ఈ సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జనావాసాల మధ్య కొబ్బరిచెట్టుపై పెద్ద శబ్దంతో పిడుగుపడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మెరుపులు, పిడుగుల దాటికి పట్టణంలోని పలు ప్రాంతాల్లో టీవీలు, ఏసీలు తదితర ఎలక్ట్రానిక్‌ సామగ్రి కాలిపోయాయని స్థానికులు తెలిపారు.

ఎబోలా వైరస్‌పై సమావేశం

రేణిగుంట: విదేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్‌ నివారణపై డీఎంహెచ్‌ఓ బాలకష్ణ నాయక్‌ ఆధ్వర్యంలోని వైద్య బృందం మంగళవారం రేణిగుంట విమానాశ్రయంలో డైరెక్టర్‌ భూమి నాథన్‌తో సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా ఇతర దేశాల నుంచి వచ్చే యాత్రికులపై అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చిన వెంటనే విమానాశ్రయంలో ప్రత్యేక క్యాంపు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. రేణిగుంట విమానాశ్రయానికి ప్రస్తుతానికి ఇంటర్నేషనల్‌ విమానాలు రాకపోయినా ఇతర విమానాల్లో అంతర్జాతీయ ప్రయాణికులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి డీఎంహెచ్‌ఓ పలు సూచనలు చేశారు. ట్రాన్సిట్‌ హబ్‌ల ద్వారా ఆఫ్రికా దేశాలు లేదా ఇతర ప్రభావిత అంతర్జాతీయ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను గుర్తించే రోజువారీ ప్రయాణికుల జాబితాల/ప్యాసింజర్‌ మానిఫెస్ట్‌లను వైద్యాధికారులతో పంచుకోవాలని విమానాశ్రయ అధికారులను కోరారు. అధిక ప్రమాదం ఉన్నట్లు గుర్తించిన ప్రయాణికులను తనిఖీ చేసి,తక్షణ క్వారంటైన్‌ నిర్వహణ కోసం తిరుపతిలోని ఎస్వీఆర్‌ఆర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో ఒక ప్రత్యేక ఈవీడీ ఐసోలేషన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉంచుతామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement