కోర్సు పూర్తి చేసిన మహిళలకు
సర్టిఫికెట్ల పంపిణీ
తిరుపతి కల్చరల్: స్వయం ఉపాధి మహిళల అభ్యున్నతికి మార్గదర్శకమని సాక్షి బ్రాంచ్ మేనేజర్ సత్యేంద్రబాబు తెలిపారు. సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బైరాగిపట్టెడలోని అనంగా బ్యూటీ స్టూడియో అండ్ ఇన్‌స్టిట్యూట్‌లో మహిళలకు నెల రోజులుగా చేపట్టిన బ్యూటీషియన్ కోర్సు శిక్షణ తరగతులు మంగళవారంతో ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని, శిక్షణ పూర్తి చేసిన మహిళలకు సర్టిఫికెట్లు పంపిణీ చేసి అభినందించారు. ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయశక్తితో ఎదిగి, తద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాలు చేపడుతూ వారి అభ్యున్నతికి తోడ్పడుతున్నట్లు తెలిపారు. సాక్షి మైత్రి మహిళ ద్వారా శిక్షణ పొందిన మహిళలు నైపుణ్యాన్ని పెంపొందించుకుంటూ స్వయం ఉపాధిలో రాణించి అభివృద్ధి పథంలో పయనించాలని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో ఈవెంట్ మేనేజర్ టి.చంద్రశేఖర్, శిక్షకురాలు, మాస్టర్స్ ఇన్ కాస్మోటాలజిస్ట్ వై.శ్యామల, మహిళలు పాల్గొన్నారు.
ఘనంగా ముగిసిన బ్యూటీషియన్ శిక్షణ


