తిరుపతి అన్నమయ్యసర్కిల్: సూళ్లూరుపేట నియోజకవర్గం తడ దక్షిణ క్యాబిన్ వద్ద రైళ్ల రాకపోకల కారణంగా లెవెల్ క్రాసింగ్ గేటు వద్ద అండర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేయాలని స్థానిక నాయకులు మంగళవారం తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తికి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించిన ఆయన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో పాటు సంబంధిత రైల్వే శాఖ అధికారులకు లేఖ రాసి, తడ సౌత్ కేబిన్ సమీపంలోని ఎల్‌సీ గేట్ నంబర్ 49 వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను లేఖ ద్వారా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం లెవెల్ క్రాసింగ్ గేటు తరచుగా మూసివేయడం కారణంగా విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు సమయానికి చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారనే విషయాన్ని ప్రస్తావించారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు కూడా ఎక్కువసేపు గేటు వద్ద నిలిచిపోవాల్సి వస్తోందని తెలిపారు. అలాగే శ్రీ సిటీ ప్రాంతానికి ప్రతిరోజూ ఉద్యోగాలకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులకు ఆలశ్యం అవుతోందని, దీని ప్రభావం వారి దైనందిన జీవన విధానంపై పడుతోందని లేఖలో పేర్కొన్నారు. ప్రజల రాకపోకలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ రోడ్డు అండర్ బ్రిడ్జి నిర్మాణం అవసరమని స్పష్టం చేశారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన రవాణా దృష్ట్యా తక్షణమే సంబంధిత రైల్వే అధికారులను ఆదేశించి ప్రతిపాదనను పరిశీలించి ఆర్‌యూబీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసి పనులు ప్రారంభించాలని కోరారు.


