పెట్టుబడి నష్టం | - | Sakshi
Sakshi News home page

పెట్టుబడి నష్టం

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

● మామిడి రైతులకు తప్పని తిప్పలు ● ఖర్చులు కూడా రావడం లేదని రైతుల ఆవేదన

కాయ కష్టం..

నేలతల్లిని నమ్ముకుని రూ.వేలు వ్యయం చేసి..కాయకష్టం చేసి మామిడి దిగుబడులు సాధించిన కర్షకులకు గిట్టుబాటు ధర గగనమైంది. తిరుపతి జిల్లాలో సంప్రదాయ పంట మామిడి అధిక విస్తీర్ణంలో సాగవుతోంది. ఈ పంట ధరలు రెండేళ్లుగా సీజన్‌ ప్రారంభం నుంచే పతనం కావడంతో అమ్ముకోలేక ఇబ్బందులు పడుతూ నష్టాల బారిన పడుతున్నారు.

నాణ్యమైన పంటకు గిరాకీ..

రైతులు పంట దిగుబడి సమయంలో పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కాయలకు దెబ్బలు తగలకుండా, వలల సాయంతో కాయలను దింపి, గ్రేడ్లలో కాయలను మార్కెట్‌కు తరలించడంతో రైతులకు మంచి గిట్టబాటు ధర లభిస్తుంది. నాణ్యత లోపిస్తే పంటకు గిరాకీ లేక రైతు నష్టాలపాలవుతారు.

– జీ.ఎం.సైదుల్లా. జీ.ఎం.ఎస్‌

మామిడి మండీ యజమాని. దామలచెరువు

మా రాష్ట్రంలో కూడా సరైన ధర లేదు

ఏటా సీజన్‌లో నేను మామిడి వ్యాపారం చేస్తుంటాను. ఇక్కడి నుంచి మామిడి కాయలను కొని మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటాను. ఈ ఏడాది అక్కడ కూడా సరై ధరలు లేకపోవడంతో ఇక్కడ వ్యాపారం చేయలేకపోతున్నాం. ప్రతీ సంవత్సరం వందల టన్నుల ఎగుమతి చేస్తుంటాం. ఈ సారి ఉన్నంతలో వ్యాపారా లావాదేవీలు జరుపుతున్నాం.

– చంద్రశేఖర్‌, వ్యాపారి, మహారాష్ట్ర(నాగపూర్‌)

గిట్టుబాటు ధర కల్పించాలి..

మామిడి రైతుల వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం నేరుగా పరిశీలించి వారిని ఆదుకునేలా చర్యలు చేపట్టాలి. రెండేళ్లుగా మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారిపోయింది. గిట్టుబాటు ధర కాదు కదా కనీసం పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదు. ఈ ఏడాదైనా ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకుని పుణ్యం కట్టుకోవాలి. – పురుషోత్తం నాయుడు,

రైతు, పూతలపట్టు మండలం

రోడ్ల పక్కన పారపోసిన నాణ్యతలేని మామిడి కాయలు

పాకాల: మామిడి మార్కెట్‌ రైతులకు నష్టాల రుచి చూపిస్తోంది. లాభాల మాట దేవుడెరుగు.. కనీసం పంటపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈ ఏడాది మామిడి పూర్తి స్థాయిలో కోతకు రాక మునుపే ధరలు లేక రోడ్లపై పారబోయాల్సి వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లు మామిడి రైతులకు కష్టాలు నష్టాలే మిగులుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని, అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి, కనీసం ఈ ఏడాదైనా లాభాలు రాకపోతాయా?.. అప్పులు తీర్చి కాస్త ఉపశమనం పొందుదామనుకున్న రైతులకు మళ్లీ నిరాశే మిగిలింది. మామిడికి మార్కెట్లో సరైన ధరలు లేకపోవడంతో మరింతగా అప్పుల్లోకి కూరుకుపోయే పరిస్థితి దాపరించిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం కలుగు చేసుకుని, మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

దక్కని గిట్టుబాటు

ప్రస్తుతం రైతులు 4 టన్నుల కాయలు విక్రయించాలంటే కూలీలు, రవాణాతో కలిపి ఖర్చు రూ.10 వేలు అవుతోంది. దీంతో పెట్టుబడి కూడా రాకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇదిలా ఉండగా గాలివానలకు భయపడి పంటను ముందుగానే కోయడం, నాణ్యత లేని కాయలను మార్కెట్‌ తరలించడంతో కూడా రైతులు నష్టాలను కోరి తెచ్చుకుంటున్నారు. ఇలా పక్వానికి రాకుండా తొందరపడి కోసిన కాయలను రైతులు రోడ్ల పాలు చేయాల్సి వస్తోంది. దామలచెరువు మామిడి మార్కెట్లో నాణ్యమైన తోతాపురి టన్ను రూ.10 వేల నుంచి 16 వేలు, బేనిషా రూ.17వేల నుంచి రూ.25 వేలు, మల్లిక రూ.15 వేల నుంచి రూ.25 వేలు, పుల్లూరు రూ.8 వేల నుంచి రూ.16వేలు, ఖాదర్‌ రూ.20వేల నుంచి రూ.27వేలకు విక్రయిస్తున్నారు. నాటు కాయలకు గిరాకీ లేకపోవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. మార్కెట్‌ ఇంకా పూర్తి స్థాయిలో పుంజుకోలేదని, అన్ని రకాల కాయలు మార్కెట్లోకి రాలేదని వ్యాపారస్తులు, మండీల యజమానులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement