చెరువైతే నాకేంటి? | - | Sakshi
Sakshi News home page

చెరువైతే నాకేంటి?

May 26 2026 11:59 PM | Updated on May 26 2026 11:59 PM

● బోరు పాయింట్‌, చుట్టూ కంచె ఏర్పాటు ● యథేచ్ఛగా పంట సాగు ● పట్టించుకోని అధికారులు

దర్జాగా చెరువు ఆక్రమణ

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: ప్రభుత్వ ఖాళీస్థలాలు ఎక్కడ ఉంటే అక్కడ పాగా వేయడం అక్రమార్కుల నైజం. పొరంబోకు స్థలాలు, వాగులు, వంకలతోపాటు తోపాటు చివరకు చెరువులపైన కూడా కబ్జాదారులు కన్ను పడింది. దీంతో ఏకంగా చెరువును యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. ఇటువంటి ఆక్రమణలు నివారించాల్సిన అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడం గమనార్హం. వెంకటగిరి మండలంలోని పారవోలు పంచాయతీ బసవాటి చెరువు రోజురోజుకు ఆక్రమణకు గురవుతోంది. ఈ చెరువు సర్వే నంబర్‌ 13లో 69.95 ఎకరాలు ఉండగా సుమారు 20 ఎకరాల మేర ఆక్రమణకు గురైంది. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నేత సుమారుగా 3.5 ఎకరాలు చెరువును ఆక్రమించి, బోరు వేయడంతోపాటు కంచె వేసి, యథేచ్ఛగా వరిపంట సైతం సాగు చేస్తున్నారు. అయినా సంబంధిత ఇరిగేషన్‌శాఖ అధికారులు తెలిసీ తెలియనట్లు వ్యవహరిస్తున్నారా? చెరువు ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారా? అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారపార్టీ నేతల అండదండలతో చెరువు ఆక్రమణలకు గురికావడంతోపాటు రూ.లక్షలు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే పాలకులు ఏమీ చేస్తున్నారని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. చెరువు ఆక్రమణలో మరి కొందరు అక్రమంగా బోరు వేయడంతోపాటు విద్యుత్‌ కనెక్షన్‌ ఏర్పాటు చేయడంపై ట్రాన్స్‌కో అధికారులు వ్యవహార శైలిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఆక్రమణలు ఇలాగే జరిగితే భవిష్యత్తులో చెరువులు కూడా కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని, దీంతో పంటలు సాగు సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పాలవడంతోపాటు, నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నత అధికారులు, పాలకులు స్పందించి భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి చెరువులను పరిరక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement