తిరుపతి క్రైం : మహిళలు, చిన్నారుల భద్రతే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ పనిచేస్తోందని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు తెలిపారు. మహిళల హక్కులు, చిన్నారుల భద్రత, పోక్సో చట్టం, సైబర్ నేరాలపై తిరుపతి తుడా కచ్చపి ఆడిటోరియంలో సోమవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. మహిళల రక్షణ విషయంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందన్నారు. మహిళలు, పురుషులతో సమానంగా ముందుకు సాగినప్పుడే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. చిన్ననాటి నుంచే పిల్లల్లో బాధ్యతాయుతమైన ఆలోచనలు, పరస్పర గౌరవ భావన పెంపొందించాలని సూచించారు. ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్లు, సోషల్ మీడియా దుర్వినియోగం కారణంగా మహిళలు, చిన్నారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లల మొబైల్ వినియోగంపై పర్యవేక్షించాలని, టెక్నాలజీని అవసరానికి మించి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ హెచ్చరించారు. కార్యక్రమంలో భాగంగా ఎస్పీ చిన్నారులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.


