తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. ఆదివారం అర్ధరాత్రి వరకు 98,058 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 49,234 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.09 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించ బోరని స్పష్టం చేసింది.
పోలీస్ గ్రీవెన్స్‌కు 85 అర్జీలు
తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీ లు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు. వెంటనే సంబంధిత అర్జీలు పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు.
అభివృద్ధి పనుల్లో జాప్యం వద్దు
తిరుపతి అర్బన్: అభివృద్ధి పనుల్లో జాప్యం చేయవద్దని, గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలసి పలు కార్యక్రమాలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుడా పరిధిలో చేపడుతున్న మౌలిక సదుపాయాల కల్పనలో నాణ్యతా ప్రమాణాలు తప్పకుండా పాటించాలని చెప్పారు. రోడ్లు, తాగునీరు, డ్రైనేజ్ పనులు, వీధిదీపాలు తదితర సదుపాయాలు కల్పించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. అలాగే పారిశ్రామికాభివృద్ధికి అవసరం అయిన భూసేకరణ పారదర్శకంగా ఉండాలని ఏపీఐఐసీ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి నిత్యం కృషి చేయాలని డీఎంఅండ్ హెచ్‌ఓకు స్పష్టం చేశారు.
దరఖాస్తుల ఆహ్వానం
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 2026–27 విద్యా సంవత్సరంలో రెండేళ్ల డిప్లొ మా ఇన్ యానిమల్ హస్బండ్రీ కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆ యూనివర్సిటీ వీసీ వినోద్ ఓ సోమవారం ఓ ప్రకటనలో కోరారు. మంగళవారం నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, ఆసక్తిగల విద్యార్థు లు www.rvvu.edu.in వెబ్‌సైట్ ద్వారా దరఖా స్తు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.


