తిరుపతి క్రైం : ఉన్నత విద్య అభ్యసించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాల్సిన ముగ్గురు యువకులు దు రలవాట్లు, ఈజీ మనీ ఆశతో చైన్ స్నాచర్లుగా మా రిన ఘటన తిరుపతిలో వెలుగుచూసింది. తిరుపతి జిల్లాతోపాటు నెల్లూరు, కావలి, గూడూరు ప్రాంతాల్లో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను తిరుపతి సీసీఎస్, వెస్ట్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. తిరుపతి జిల్లా అదనపు ఎస్పీ (క్రైమ్స్)ఆర్ల శ్రీనివాసులు ఆదివారం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. తిరుపతిలో పెరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలను ఛేదించేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పి.రామకృష్ణ, క్రైమ్ ఇన్‌స్పెక్టర్ ఎన్.శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో మే 25 ఉదయం అలిపిరి–చెర్లోపల్లి రోడ్డులోని సైనన్స్ సెంటర్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని విచారించగా పలు చైన్ స్నాచింగ్ కేసుల్లో వారి ప్రమేయం బయటపడింది. దీంతో శీలం నాగార్జున రెడ్డి (28), నల్లగొండ వెంకట మురళి (26), లింగాలదిన్నే విష్ణువర్ధన్ రెడ్డి (28)ని అరెస్టు చేశారు. వీరిలో ఒకరు బెంగళూరులో అగ్రికల్చరల్ బీఎస్సీ పూర్తి చేయగా, మరొకరు బీకాం కంప్యూటర్స్ గ్రాడ్యుయేట్, ఇంకొకరు బీఎస్సీ స్టాటిస్టిక్స్ చదివి బెంగళూరులోని ప్రముఖ సంస్థలో సిస్టమ్ ఇంజినీర్‌గా పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. వీరు ఉన్నత చదువులు చదివిన్నప్పటికీ ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, విలాసవంతమైన జీవనశైలి తదితర దురలవాట్లకు బానిసలై ఉద్యోగాలు కోల్పోవడంతో డబ్బు సంపాదించాలనే ఆశతో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో మొత్తం తొమ్మిది చైన్ స్నాచింగ్ కేసులకు పాల్పడినట్లు వారు అంగీకరించారు. వారి వద్ద నుంచి రూ.25 లక్షల విలువ చేసే సుమారు 130 గ్రాముల, బంగారు ఆభరణాలు, యమహా ఎఫ్ జెడ్ మోటార్ సైకిల్, హోండా ఆక్టివా స్కూటీ, మొబైల్ ఫోన్లు, హెల్మెట్లు, క్యాపులు, మాస్కులు స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఆర్ల శ్రీనివాసులు, డీఎస్పీ ఎం. భక్తవత్సలం నేతృత్వంలోని తిరుపతి వెస్ట్, క్రైమ్ పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు ప్రత్యేకంగా అభినందించి, రివార్డులు ప్రకటించారు.


