ప్రత్యేక సవరణపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక సవరణపై అప్రమత్తత అవసరం

May 26 2026 8:00 AM | Updated on May 26 2026 8:00 AM

– ఎంపీ గురుమూర్తి

తిరుపతి మంగళం : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై అప్రమత్తంగా ఉండాలని సత్యవేడు నియోజకవర్గ నాయకులకు తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి సూచించారు. తిరుపతిలోని ఎంపీ కార్యాలయంలో సోమవారం వైఎస్సార్‌ సీపీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త నూకతోటి రాజేష్‌తోపాటు పార్టీ నాయకులు ఎంపీ గురుమూర్తిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గంలోని ప్రతి బూత్‌ పరిధిలో బీఎల్‌ఏలు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేస్తూ ఓటర్ల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. అర్హులైన ఓటర్ల పేర్లు జాబితాలో ఉండేలా చూడడంతో పాటు, ఎలాంటి అక్రమ తొలగింపులు జరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. కూటమి నాయకులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని, అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అనుసరించాల్సిన విధానం, ఫారం దాఖలు, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన తదితర అంశాలపై ఎంపీ గురుమూర్తి వారికి దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్‌ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను ధ్రువీకరించాలని, ప్రజలకు ఎస్‌ఐఆర్‌పై స్పష్టమైన అవగాహన కల్పించాలని సూచించారు. ప్రత్యేకంగా యువ ఓటర్లు, మహిళలు, వృద్ధుల పేర్లు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ప్రతి దరఖాస్తును జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితా నుంచి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు బాధ్యతగా వ్యవహరించాలని ఎంపీ గురుమూర్తి కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement