తిరుమల : టీటీడీకి ఆదివారం గుంటూరుకు చెందిన ఇద్దరు భక్తులు వేర్వేరుగా రూ.20లక్షల విరాళాలను అందించారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు మాదాల శేషగిరిరావు రూ.10,01,116, వడ్లమూడి మిత్రేష్ అనే భక్తుడు ప్రాణదాన ట్రస్టుకు రూ.10,01,111 విరాళంగా అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో డిప్యూటీ ఈఓ లోకనాథానికి డీడీలను అందించారు. టీటీడీ బోర్డు సభ్యుడు నన్నపనేని సదాశివరావు పాల్గొన్నారు.
ఆర్‌సీడీఎస్ జిల్లా అధ్యక్షుడిగా మనోజ్‌కుమార్‌రెడ్డి
నాయుడుపేట టౌన్ : రెడ్డి కమ్యూనిటీ డెవలప్‌మెంట్ సొసైటీ జిల్లా అధ్యక్షుడిగా కె.మనోజ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఆదివారం ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ఆర్‌సీడీఎస్ రాష్త్ర అధ్యక్షుడు యర్రపురెడ్డి సురేంద్రరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రెడ్డి సామాజికవర్గం ఐక్యత, ఆత్మీయత, సేవే లక్ష్యంగా కృషిచేస్తానని వెల్లడించారు.
నేటి నుంచి
‘పది’ సప్లిమెంటరీ
తిరుపతి కల్చరల్ : పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలను సోమవారం నుంచి నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎస్ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీ వరకు ప్రతి రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష జరుగనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఈనెల 28వ తేదీ నిర్వహించాల్సిన ఇంగ్లిష్ పరీక్షను బక్రీద్ పండుగ కారణంగా జూన్ 5వ తేదీకి వాయిదా వేసినట్లు వివరించారు. విద్యార్థులకు ఏదైనా సమస్య తలెత్తితే 7842641323 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.
నేడు
‘డయల్ యువర్ సీఎండీ’
తిరుపతి రూరల్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ నిర్వహించనున్నారు. ఆదివారం ఈ మేరకు సీఎండీ కార్యాలయం అధికారులు మాట్లాడుతూ తిరుపతి, చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661 నంబర్‌కు కాల్ చేయవచ్చన్నారు. తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకు రావచ్చని, ఫోన్ చేసిన సమయంలో సర్వీసు నంబరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
సర్కిల్ స్థాయిలో సైతం..
వినియోగదారులు సర్కిల్ స్థాయిలో సైతం డయల్ యువర్ ఎస్‌ఈకి సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల ఫోన్ చేయవచ్చని అధికారులు తెలిపారు. ఈ మేరకు తిరుపతి వినియోగదారులు 8712652679 నంబర్‌కు, చిత్తూరు: 7993147979, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: 08612320427, అన్నమయ్య: 9440817449, వైఎస్సార్ కడప: 08562242457, కర్నూలు: 7382614308, నంద్యాల: 7382618976, అనంతపురం: 9154790350, శ్రీసత్యసాయి: 9963707847 ఫోన్ చేయాలని వివరించారు.
సాహితీ శిఖరం
‘ఏటుకూరి’
తిరుపతి కల్చరల్: అరసం పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన సాహితీ శిఖరం ఏటుకూరి ప్రసాద్ అని, ఆయన హఠాన్మరణం తీరని లోటని పలువురు వక్తలు తెలిపారు. ఆదివారం అరసం సభల ముగింపు సందర్భంగా శనివారం రాత్రి ఏటుకూరి ప్రసాద్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. మహాసభలు జరుగుతున్న తరుణంలో ఏటుకూరి తుది శ్వాస విడవడం బాధాకరమన్నారు. ఏటుకూరి జీవితం పరిపూర్ణమైందని, సమాజ శ్రేయస్సు కోసం నిత్యం పరితపించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. కార్యక్రమంలో అరసం జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి, వల్లూరు శివప్రసాద్, నేతలు సాకం నాగరాజు, యువశ్రీ మురళి, గంటా మోహన్, కిట్టన్న, సీపీఐ జాతీయ నేత నారాయణ, హరినాథరెడ్డి, ఆనంద్, సంజీవమ్మ, సుశీలమ్మ, కుసుమకుమారి పాల్గొన్నారు.


