● నిధులు లేవని పనులు నిలిపివేసిన చంద్రబాబు ప్రభుత్వం ● సర్కారు నిర్లక్ష్యంతో అప్పటికే పూర్తి చేసినవి సైతం నిరుపయోగం ● పంటలను నిల్వ చేసుకునేందుకు ఇబ్బందిపడుతున్న రైతాంగం
నిల్వకు తప్పని ఇక్కట్లు
జిల్లావ్యాప్తంగా రైతులు రబీ, ఖరీఫ్ సీజన్లలో ఏటా 5.5 లక్షల టన్నుల ధాన్యం పండిస్తున్నారు. అందులో సొంత వాడకం 1.5 లక్షల టన్నులు మినహాయిస్తే మిగిలిన 4 లక్షల టన్నులను విక్రయిస్తున్నారు. ఆ మేరకు గోదాములు నిర్మించాలని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంకల్పించింది. అయితే కొత్త గోదాము నిర్మాణ పనులను చంద్రబాబు సర్కార్ అటకెక్కించేసింది. ప్రస్తుతం జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలోని 37 గోడౌన్లలో 34,300 టన్నులు, శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ పరిధిలో 5వేల టన్నులు, మల్టీపర్పస్ ద్వారా పూర్తి చేసిన 18 గోదాముల్లో 15వేల టన్నులు, మొత్తంగా 54,300 టన్నులు మాత్రమే నిల్వచేసుకునే సౌకర్యం ఉంది. అయితే ఇందులో సైతం పలు గోడౌన్లు నిరుపయోగంగా ఉండడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
తిరుపతి అర్బన్ : గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా వ్యాప్తంగా 145 గోదాముల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 74వేల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులను రైతులు నిల్వలు చేసుకునే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. వరి, వేరుశనగ, సజ్జ, రాగులు, చిరుధాన్యాలతోపాటు ఇతర పంటలను స్టోర్ చేసుకునేలా మల్టీపర్పస్ గోడౌన్ల నిర్మాణం చేపట్టారు. పంటను నిల్వ చేసుకుని మంచి ధర వచ్చిన తర్వాత రైతులు అమ్ముకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని సంకల్పించారు. ప్రాథామిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల నేతృత్వంలో గోదాములను నిర్వహించాలని తలపెట్టారు. 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 3 గోదాములు, 500 మెట్రిక్ టన్నులు నిల్వ చేసుకునేలా 142 నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. ఈ మేరకు ఒక్కో గోడౌన్‌కు రూ.44 లక్షలు మంజూరు చేశారు. ఈ క్రమంలో తొలి దశలో 46 గోదాములు, రెండో దశలో 21, మూడో విడతలో 78 నిర్మించాలని నిర్ణయించారు. అందులో తొలి దశ కింద 28 గోడౌన్లును నిర్మించేశారు. ఇంతలో సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో మిగిలిన పనులు నిలిచిపోయాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గోడౌన్ల ఊసే లేకుండా పోయింది.
నిధులు లేవంటూ నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత గోడౌన్ల నిర్మాణానికి నిధులు లేవంటూ నిర్లక్ష్యం వహించింది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో పూర్తి చేసిన 28 గోదాములను సైతం అందుబాటులోకి తీసుకురాకుండా గాలికి వదిలేసింది. అలాగే మిగిలిన గోదాములకు నిధుల కొరతంటూ మంగళం పాడేసింది.
స్పందించిన కలెక్టర్
నిర్మాణ పనులు పూర్తయిన గోడౌన్లకు రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సూచించారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం ఆయన స్పందించారు. డీసీఓ నాగవర్ధినికిఆదేశాలు ఇచ్చారు. అవసరాల మేరకు జిల్లా పరిషత్ నిధులు వినియోగించుకోవాలని స్పష్టం చేశారు.


