శ్రీవారి సేవలో భారత క్రికెట్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ | - | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో భారత క్రికెట్‌ ఫీల్డింగ్‌ కోచ్‌

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

తిరుమల: తిరుమల శ్రీవారిని ఆదివారం భారత క్రికెట్‌ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు ఘనంగా లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.

నేడు ఏపీఐఐసీ పార్కుకు

శంకుస్థాపన

డక్కిలి : మండలంలోని సంగనపల్లెలో ఏపీఐఐసీ పార్కుకు సోమవారం విజయవాడ నుంచి ముఖ్యమత్రి చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నట్లు తహసీల్దార్‌ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్కు నిర్మాణానికి 15 ఎకరాలను కేటాయించామన్నారు. ఈ క్రమంలోనే శంకుస్థాపనకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హాజరుకానున్నట్లు వివరించారు.

ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో ప్రమోద

వరదయ్యపాళెం: వరదయ్యపాళెంకు చెందిన డాక్టర్‌ మన్నెం మునిప్రమోద ప్రతిష్టాత్మక ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో (ఐబీఆర్‌ ) అచీవర్‌గా నిలిచి సత్తా చాటారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ రీసెర్చ్‌ అండ్‌ అనలిటికల్‌ రివ్యూస్‌ (ఐజేఆర్‌ఏఆర్‌) వాల్యూమ్‌ 12, ఇష్యూ 4లో ఆయన రెండు వ్యాసాలు ప్రచురితమయ్యాయి. అందులో ‘సెలెస్టియల్‌ బాడీ కాన్స్‌టంట్‌ ఖగోళ శాస్త్రానికి సంబంధిత పరిశోధన వ్యాసం 2025 అక్టోబర్‌ సంచికలో రాగా.. ‘మ్యాజిక్‌ టేబుల్స్‌’ గణితంలోని ఆసక్తికరమైన అంశంపై రాసిన మరో వ్యాసం అదే ఏడాది డిసెంబర్‌ సంచికలో ప్రచురితమైంది. ఒకే జర్నల్‌ వాల్యూమ్‌లో రెండు వేర్వేరు అంశాలపై వ్యాసాలు ప్రచురించడం అరుదైన ఘనతగా ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ గుర్తించింది. 2026 ఏప్రిల్‌ 28న ఈ రికార్డును ఽధ్రువీకరించడంతో శనివారం ఐబీఆర్‌ అచీవర్‌’ సర్టిఫికెట్‌ను అందుకున్నట్టు ప్రమోద తెలిపారు. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ చీఫ్‌ ఎడిటర్‌ డాక్టర్‌ బిస్వరూప్‌ రాయ్‌ చౌదరి సంతకంతో కూడిన ధ్రువపత్రంతో పాటు ఐబీఆర్‌ మెడల్‌, బ్యాడ్జ్‌, గుర్తింపు కార్డు అందజేసినట్టు ఆయన వివరించారు. కాగా, డాక్టర్‌ ప్రమోద ప్రస్తుతం వరదయ్యపాళెం తహసీల్దారు కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

ప్రత్యామ్నాయానికి

స్వాగతం పలుకుతాం

తిరుపతి కల్చరల్‌: దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థ వచ్చి తీరుతుందనే విశ్వాసం తమకు ఉందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ నారాయణ స్పష్టం చేశారు. అది కాక్రోచ్‌ రూపంలో వచ్చినా, మరో రూపంలో వచ్చినా స్వాగతం పలుకుతున్నామన్నారు. ఆదివారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడిదారులు రెండు వర్గాలుగా విడిపోయి, వారికి వారే పోటీగా మారారని తెలిపారు. యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌ పరిణామాలు నిరూపించాయని వెల్లడించారు. తాజాగా తమిళనాడులో సైతం కొత్తపార్టీని ఎన్నుకున్నారని గుర్తుచేశారు. ప్రత్యామాన్నయ రాజకీయ ఉద్యమాల్లో పాల్గొనేందుకు వామపక్షక్ష వాదులు, సీపీఐ సిద్ధంగా ఉండాలని కోరుతున్నట్లు పిలుపునిచ్చారు. మన రాష్ట్రంలో కూడా అవినీతికి, అవినీతికి మధ్యే పోటీ ఉందని వెల్లడించారు.

అనుమానాస్పదంగా గర్భిణి మృతి

పెళ్లకూరు : మండలంలోని దొడ్లవారిమిట్టకు చెందిన ఆటో డ్రైవర్‌ సీమకోటి ప్రభాకరన్‌ భార్య భువన (25) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు.. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన ప్రభాకరన్‌ దంపతులు జీవనోపాధి కోసం దొడ్లవారిమిట్ట గ్రామంలో తమ బంధువులతో కలిసి నివాసం ఉంటున్నారు. వారికి ప్రణవ్‌, అర్షిక అనే ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం భువన నాలుగు నెలల గర్భిణి. అయితే ముగ్గురు పిల్లలను పోషించే పరిస్థితి లేదని మూడు రోజుల క్రితం గర్భనిరోధక మాత్రలు తెచ్చుకుని మింగినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే అప్పటి దాకా ఆరోగ్యంగా ఉన్న భువన ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయిందంటూ ఇంట్లో ఉన్న అత్త కేకలు వేయడంతో హుటాహుటిన నాయుడుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement