పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్
విలేకరి హత్య కేసులో కొత్త విషయాలు
గ్యాంగ్‌లతో దందాలు చేస్తున్నారని వెల్లడి
తప్పు చేసిన వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక
బాధితులు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచన
పేర్లను గోప్యంగా ఉంచుతామని భరోసా
వి.కోట: తమ దందాలకు అడ్డుపడుతున్నాడనే విలేకరి జగన్‌మోహన్‌రెడ్డిని నిందితులు హత్య చేసినట్టు తేలిందని పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ సోమశేఖర్‌రెడ్డి తెలిపారు. వారు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. విలేకరి జగన్ మోహన్‌రెడ్డి హత్య కేసు విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయని, కొంతమంది వి.కోటలో గ్యాంగ్‌లను ఏర్పాటు చేసుకుని దందాలు చేస్తున్నట్టు తెలిసిందని తెలిపారు. తప్పుచేసిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విలేకరి హత్యకు తమీమ్‌ను బీఎస్పీ శ్రీనివాస్ ప్రేరేపించాడన్నారు. బీఎస్పీ శ్రీనివాసులు ఒక గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకుని వివిధ కేసుల్లో పోలీసుల పేర్లు చెప్పి చాలా మంది ప్రజల నుంచి డబ్బు వసూలు చేసినట్టు తేలిందన్నారు. ఎవరైనా గ్యాంగ్‌గా ఏర్పడి మీడియా సపోర్ట్ ఉందని, ప్రెస్ రిపోర్టర్‌నని, తాను లీడర్‌నని బెదిరించి డబ్బులు తీసుకుని ఉంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. బాధితుల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
పథకం ప్రకారం..
అన్ని విషయాల్లోనూ విలేకరి జగన్ అడ్డు పడుతున్నాడని, అతన్ని అడ్డు తొలగించుకోవాలని బీఎస్పీ నేత శ్రీనివాస్ హత్యకు పథకం పన్నినట్టు తేలిందన్నారు. అదేవిధంగా ఒక మహిళ మరొక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిపారు. ఆమె భర్త న్యాయం చేయాలని పోలీసు స్టేషన్‌కు వెళ్లగా బీఎస్పీ శ్రీనివాసులు కలుగజేసుకుని న్యాయం చేస్తానని చెప్పి నమ్మించాడన్నారు. అతని నుంచి రూ.3 లక్షలు డిమాండ్ చేశాడన్నారు. అందులో కొంత మొత్తం తీసుకున్నాడని, మిగిలిన మొత్తానికి అగ్రిమెంట్ రాసుకున్నాడని తెలిపారు. అదే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడని, బైరెడ్డిపల్లిలో సహజీవనం సాగించేవాడని గుర్తించామన్నారు. అంతేగాక బంగారు నగలు బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.9 లక్షలను బీఎస్పీ శ్రీనివాసులు, గణపతి, ముళబాగల్ శివ తీసుకున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో విలేకరి జగన్‌మోహన్‌రెడ్డి కలుగజేసుకున్నాడని తెలిపారు. వారి వద్ద తీసుకున్న నగదు తిరిగి ఇచ్చేయాలని హితవుపలికాడన్నారు. దీంతో అన్ని విషయాల్లోనూ తమకు అడ్డుపడుతున్నాడని జగన్‌మోహన్‌రెడ్డిపై కక్ష పెంచుకున్నాడని తెలిపారు. అదేవిధంగా గంజాయి, మత ఘర్షణల కేసులు తనపై నమోదు కావడానికి జగన్‌మోహన్‌రెడ్డి కారణమయ్యాడని తమీమ్ కక్ష పెంచుకున్నాడన్నారు. ఈ నేపథ్యంలో తమీమ్, బీఎస్పీ శ్రీనివాసులు కలిసి అతన్ని హత్య చేయాలని కుట్ర పన్నారని తెలిపారు. రెండు సార్లు విఫలమయ్యారని, మూడో సారి హత్య చేశారని తెలిపారు. అలాగే కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మత విద్వేషాలను రగిల్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ ఫొటోలు మార్పింగ్ చేసి రాజకీయ విభేదాలు, మత విద్వేషాలను రెచ్చగొట్టేలా పోస్టులు పెడుతున్నట్టు గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.


