జారుతారు | - | Sakshi
Sakshi News home page

జారుతారు

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

● దారుణంగా తిరుపతి– చైన్నె జాతీయ రహదారి ● నాసిరక నిర్మాణంతో గుంతలమయం ● ఎండ తీవ్రతకు తారు కరిగి ఛిన్నాభిన్నం

వరదయ్యపాళెం: తిరుపతి నుంచి పుత్తూరు, పిచ్చాటూరు, నాగలాపురం, ఊత్తుకోట మీదుగా చైన్నెకి వెళ్లే 716ఏ జాతీయ రహదారి అధ్వానంగా మారిపోయింది. ప్రధానంగా కొప్పేడు దళితవాడ వద్ద రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. మండే ఎండల తాకిడి తారు పూర్తిగా కరిగిపోయి వాహనదారులకు నరకం చూపిస్తోంది. ఇదే పరిస్థితి ఈ మార్గంలో పలుచోట్ల తలెత్తింది.

ముద్రపడిపోయి..

కొప్పేడు సమీపంలో రహదారిపై తారు కరిగిపోయింది. జీబ్రా క్రాసింగ్‌ వద్ద తెల్లటి గీతలు వంకర్లు తిరిగిపోయాయి. భారీ వాహనాల రాకపోకలతో తారు ఊడిపోయి అక్కడక్కడా గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు మధ్యలో తారు కరిగి టైర్ల గుర్తులు అలాగే ముద్రపడిపోయాయి.

ప్రమాదకరంగా ప్రయాణం

ఈ రహదారి తిరుపతి–చైన్నె మధ్య కీలకమైన మార్గం. నిత్యం వందలాది లారీలు, బస్సులు, కార్లు ఈ దారిలో వెళుతుంటాయి. కరిగిన తారుపై ద్విచక్ర వాహనాలు జారిపోతున్నాయి. ఉబ్బిన చోట్ల కార్లు అదుపుతప్పుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుంతలు కనిపించక ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు వెల్లడిస్తున్నారు.

నాణ్యత లేకపోవడంతోనే..

ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి ఎదురవుతోందని, నాణ్యతలేని మెటీరియల్‌ వాడడం వల్లే తారు వెంటనే కరిగిపోతోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఎన్‌హెచ్‌–716ఏపై కొప్పేడు దళితవాడ వద్ద వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు., ఎండ తీవ్రతను తట్టుకునేలా నాణ్యమైన రోడ్డు నిర్మించాలని హైవే అధికారులను డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement