నేత..మేత! | - | Sakshi
Sakshi News home page

నేత..మేత!

May 25 2026 9:57 AM | Updated on May 25 2026 9:57 AM

దాదాపు 625 ఎకరాలను

ఆక్రమించిన వైనం

మోటార్లు ఏర్పాటు చేసి నిమ్మ సాగు

పట్టనట్టు వ్యవహరిస్తున్న రెవెన్యూ,

అటవీశాఖ అధికారులు

కలువాయి(సైదాపురం): కొందరు భూ ఆక్రమణదారులు దర్జాగా మేతపోరంబోకు భూమి ఆక్రమించి నిమ్మ మొక్కలు నాటిన ఘటన కలువాయి మండలం, తిరుమలపాడులో చోటుచేసుకుంది. వివరాలు.. తిరుమలపాడు, కేశమనేనిపల్లి గ్రామాల్లో 438 సర్వే నంబర్‌లో 630 ఎకరాల మేత పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిని కొందరు కూటమి నేతలు ఆక్రమించుకొని నిమ్మ మొక్కలు సాగుచేశారు. మరికొందరు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. పొలం కొన్న వారు నిమ్మ మొక్కలు నాటుతున్నారు. బోర్లు వేసి తిరుమలపాడు గ్రామం నుంచి అక్రమంగా కరెంట్‌ తీసుకొని ఉపయోగిస్తున్నారు. త్రీ ఫేజ్‌ కరెంటు వైర్లు దారి వెంబడి మూడు కిలోమీటర్లు మేర రోడ్డుపైనే పరిచారు. ఎటువంటి అనుమతులు లేకుండా కరెంట్‌ చౌర్యం చేస్తున్నా విద్యుత్‌శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు సోలార్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మరి కొందరు డ్రిప్‌ను ఉపయోగించి నిమ్మ మొక్కలు సాగుచేస్తున్నారు. ప్రభుత్వం భూమితోపాటు ఫారెస్టు భూమి కూడా వదలకుండా ఆక్రమించేస్తున్నారు. అడివిలో చెట్లను నరికి పొలాల చుట్టూ కంచె వేసుకుంటున్నారు. వీటితోపాటు అటవీ జంతువుల కోసం పొలం వద్ద కరెంట్‌ తీగలను ఏర్పాటు చేసి వేటాడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ చొరవ తీసుకుని ఆక్రమణదారుల చెర నుంచి మేత పోరంబోకు భూమిని విడిపించి, నిరుపేదలకు ఇవ్వాలని కేశమనేనిపల్లి, తిరుమలపాడు గ్రామాల నిరుపేదలు కోరుతున్నారు.

కలువాయి మండలంలో మేత పోరంబోకు భూమి ఆక్రమణ

Advertisement
 
Advertisement
Advertisement