తిరుమల: వేసవి సెలవునేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్ధీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో పారిశుద్ధ్య నిర్వహణపై టీటీడీ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రత్యేకంగా మరుగుదొడ్ల వద్ద ప్రత్యేక సిబ్బందిని నియమించి, ఎప్పటికప్పుడు శుభ్రపరిచేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను అమలు చేస్తోంది. అలాగే రోడ్ల పరిశుభ్రత విషయంలో కూడా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. రియల్ టైమ్ రోడ్ స్వీపింగ్, చెత్త సేకరణ, నీటి స్ప్రే వంటి పనులు నిరంతరం కొనసాగిస్తోంది. రోజూ సుమారు 60 టన్నుల నుంచి 75 టన్నుల వరకు చెత్తను డంపింగ్ యార్డుకు తరలిస్తోంది. ఈ మేరకు తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు పరిసరాల పరిశుభ్రతలో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేస్తోంది.
గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం
శ్రీకాళహస్తి : పట్టణంలోని విజయ రైతు డిపో షాపింగ్ కాంప్లెక్స్ మెట్లపై గుర్తుతెలియని వృద్ధుడి (65) మృతదేహాన్ని గుర్తించిట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు. మృతుడి ఒంటిపై గోధుమ రంగుపై నలుపు గీతల ఫుల్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు డ్రాయర్ ఉందని వెల్లడించారు. ఆనవాళ్లను బట్టి ఎవరైనా గుర్తుపడితే 9440900008, 9154141887 నంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
చేదబావిని మింగిన ఘనుడు!
పలమనేరు: కబ్జాకు ఏదీ అనర్హం కాదని కూటమి నేతలు నిరూపిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వ భూములు, వంకలు, వాగులు, చెరువులను సైతం ఆక్రమించుకుంటున్నారు. పలమనేరు మండలం సముద్రపల్లి పంచాయతీ నూనేవారిపల్లిలో దశాబ్దాల క్రితం గ్రామస్తుల దప్పికతీర్చేందుకు బ్రిటీషర్లు కట్టించిన చేదబావిని టీడీపీ యువనేత ఆక్రమించుకుని బావిని పూడ్చేశాడు. దీనిపై గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. నూనేవారిపల్లెలో బ్రిటీషువారు రాతికట్టడంతో చేదబావిని కట్టించారు. కొన్నాళ్ల క్రితం అది ఎండిపోయింది. ఈ చేదబావిపై టీడీపీ నేత జయచంద్ర కన్ను పడింది. ఇటీవల బావిని పూడ్చేశాడు. రెండు రోజుల క్రితం రాతి స్తంభాలను తొలగించాడు. దాని ఆనవాళ్లు లేకుండా చేసి తన ఇంటి స్థలంలో కలుపుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దీనిపై రెవెన్యూ అధికారులకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.


