డక్కిలి: మండలంలోని వెంబులూరులో శనివారం రాత్రి తమ 56 సెంట్ల పట్టా భూమిలోని నిమ్మ చెట్లను అక్రమంగా తొలగించాలని రైతులు పూల వెంకటేశ్వర్లు, పూల కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం వారు మాట్లాడుతూ తహసీల్దార్ శ్రీనివాసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వాపోయారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే అధికారులు తమ పట్టా భూమిలో కాలువ పొరంబోకు కలిసిందని సాకు చూపించి నిమ్మచెట్లను జేసీబీతో తొలగించారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అధికారుల వైఖరిపై వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ చింతల శ్రీనివాసులురెడ్డి, మాధవయ్యపాళెం సొసైటీ మాజీ అధ్యక్షుడు నర్రావుల వేణుగోపాల్‌నాయుడు మండిపడ్డారు. రాత్రివేళ అక్రమంగా రైతుల భూమిలోకి పోలీసులతో కలిసి ప్రవేశించి దౌర్జన్యానికి పాల్పడడం దారుణమన్నారు. రైతులకు కనీసం ముందుస్తు నోటీసులు ఇవ్వకుండా నిమ్మ చెట్లను తొలగించడం సరికాదని స్పష్టం చేశారు. కాలువ పొరంబోకు భూమి అని అధికారులు గుర్తిస్తే సర్వే చేయించాలని, భూ యజమానులకు నోటీసులు ఇవ్వాలని, రైతులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు.


