ఎవరి కోసం ఈ తాపత్రయం చిరు వ్యాపారులపై దండెత్తిన కూటమి నిర్దాక్షిణ్యంగా తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్ల తొలగింపు నిలువరించేదుకు చిరు వ్యాపారుల యత్నం దౌర్జన్యంగా తొలగించేసిన వైనం
పేదలని కూడా చూడకుండా కూటమి ప్రభుత్వం చిరు వ్యాపారులపై దండెత్తడం వెనుక రాజకీయ ఒత్తిళ్లేనని బాధితులు ఆరోపించారు. సమీపంలో అరకు వ్యాలీ కాఫీ పేరుతో శాప్ చైర్మన్ రవి నాయుడు తన బినామీ పేరుతో పెద్ద కొట్టును నిర్వహిస్తున్నాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ 24 గంటలూ కావాల్సినవి దొరుకుతున్నాయి. తన వ్యాపార సామ్రాజ్యానికి చిరు వ్యాపారులు అడ్డుగా ఉన్నారని భావించే తొలగింపునకు అనధికారిక ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఓ వ్యక్తి కోసం తమ కుటుంబాలను రోడ్డుపాలు చేస్తారా? అంటూ బాధితులు బోరున విలపించారు. తమ తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లు, వంట సామగ్రిని సైతం యంత్రాలతో ధ్వంసం చేశారని మండిపడ్డారు. పేదలపై ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా? అంటూ నిలదీశారు. అయినా కనికరించని పాలకులు పేదల పక్షాన నిలబడకపోగా పోలీసులు, అధికారులు సంయుక్తంగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించేశారు. అనంతరం రోడ్డు పొడవునా గాడి తవ్వించారు.
తిరుపతి తుడా: కూటమి ప్రభుత్వం పేదలపై పగ పట్టింది. పేదలపై అత్యంత కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏళ్లపాటు వ్యాపారాలు చేసుకుంటున్న తోపుడుబండ్లు, టిఫిన్ సెంటర్లపై ఉక్కుపాదం మోపింది. ప్రత్యామ్నాయం చూపకుండా బలహీనులను రోడ్డున పడేసింది. తమ కడుపు కొట్టొద్దంటూ వేడుకున్న మహిళలపై కూటమి కనికరం చూపలేదు. యంత్రాలను మహిళలపై ప్రయోగించింది. తొలగింపును అడ్డుకున్న వారిని నిర్ధాక్షిణ్యంగా లాగి పడేసింది. ఈ క్రమంలో ఓ యువతితోపాటు మరో మహిళకు గాయాలయ్యాయి. శ్రీవారి పాదాల చెంత తిరుపతిలోని అలిపిరి వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది.
చిరువ్యాపారుల అర్తనాదాలు
నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగే శ్రీవారి పాదాలు చెంత అలిపిరిలో చిరు వ్యాపారుల ఆర్తనాదాలు మిన్నంటాయి. అలిపిరి జూ పార్కు రోడ్డులో ఏడెనిమిది ఏళ్లుగా పేదలు చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నాయి. హఠాత్తుగా పోలీసుల సహకారంతో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ యంత్రాంగం రోడ్డు ఆక్రమణల పేరుతో పేదలపై దండయాత్ర చేసింది. ఫుడ్ వేస్ట్‌ను రోడ్లపై పారబోయడంతో తరచూ జంతువులు వస్తున్నాయని, రోడ్డును అపరిశుభ్రంగా చేస్తున్నారన్న కారణాలతో జూపార్క్ రోడ్డు లోని చిరు వ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5.30 గంటలకే పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఇడ్లీ, దోసె, చట్నీ, సాంబార్లతో వ్యాపారం సాగిస్తున్నారు. వారిని ఖాళీ చేయమని కార్పొరేషన్ సిబ్బంది చెప్పడంతో గంటపాటు చిరు వ్యాపారులకు, సిబ్బందికి వాదోపవాదనలు జరిగాయి. ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందేనని హుకుం జారీ చేయడంతో చిరు వ్యాపారులు బాధితులుగా మారారు. ఈ క్రమంలో పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది చిరు వ్యాపారులపై కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆహారం సైతం పారబోసి తోపుడు బండ్లు, మొబైల్ వ్యాన్లను జేసీబీల సాయంతో ట్రాక్టర్లలో ఎక్కించేందుకు ప్రయత్నం చేశారు. బాధితులతో కలిసి సీపీఎం నేతలు జేసీబీ, ట్రాక్టర్లకు అడ్డుగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాటలు జరిగాయి. తమ వ్యాపార సామగ్రిని తరలించకుండా చేసేందుకు చిరు వ్యాపారులు విఫలయత్నం చేశారు. పోలీసులు, కార్పొరేషన్ సిబ్బంది బాధితులను పక్కకు నెట్టి దౌర్జన్యంగా వాటిని తరలించారు. బాధితులు బోరున విలిపించారు. నోరు కొట్టుకుంటూ దేవుడా మాకు దిక్కెవరు.. మా కడుపు కొట్టి మమ్మల్ని రోడ్డుపాలు చేస్తారా? అంటూ బోరున విలపించారు. కూటమినేతలపై భగ్గుమన్నారు. తమ సామగ్రిని తొలగించకుండా అడ్డుపడిన ఓ యువతి చందుకు తీవ్ర గాయం అయ్యింది. జేసీబీ తగలడంతో ఆ యువతి నొప్పిని భరించలేకపోయింది. పక్కనే ఉన్న యువతి తల్లి సైతం బోరున విలిపించారు. ఆ యువతితోపాటు మరో మహిళ చేతికి గాయాలయ్యాయి.
ఏమిటీ దౌర్జన్యం?


