● దుండగులను అరెస్ట్ చేయడంలో పోలీసుల నిర్లక్ష్యం ● దశరథరామిరెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శ
తిరుపతి కల్చరల్: తిరుపతిలో చికిత్స పొందుతున్న రాయ చోటి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డిని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి ధైర్యం చెబుతూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న నాయకుడిపై దాడి జరగడం అత్యంత హేయమన్నారు. రాజకీయ కక్షలతో హింసకు పాల్పడడం దుర్మార్గమని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయడంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, బాధ్యులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
మామిడి రైతులూ తొందర పడొద్దు
తిరుపతి అర్బన్: జిల్లాలోని మామిడి రైతులు తొందరపడి కాయ లు పూర్తి పక్వానికి రాకముందే కోతకు వెళ్లడం ద్వారా నష్టాలు వస్తాయని, పూర్తి పక్వానికి వచ్చాకే కోతకు వెళ్లాలని కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ సూచించారు. శనివారం కలెక్టరేట్ నుంచి వర్చువల్ పద్ధతిలో ఉద్యానశాఖ అధికారులతో మామిడి ధరలపై కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోతాపురి, బేనిషా, ఖాదర్ వంటి టేబుల్ రకాల మామిడికి వాస్తవంగా మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయని ఉద్యానశాఖ అధికారులను ప్రశ్నించారు. రైతులు పూర్తి పక్వానికి వచ్చాకే మామిడి కాయల కోత చేపట్టేలా అవగాహన కల్పించాలని చెప్పారు. ఈ నెల 25 తర్వాత జిల్లాలోని అన్ని గుజ్జు పరిశ్రమలు ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. అలాగే మామిడి కోతలు ఒక్కసారిగా కాకుండా దశలవారీగా కోతలు చేపట్టాలని సూచించారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 87,689 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 44,476 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 4.29 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామివారిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది.


