చెరువెక్కడ చంద్రన్నా? | - | Sakshi
Sakshi News home page

చెరువెక్కడ చంద్రన్నా?

May 24 2026 1:33 AM | Updated on May 24 2026 1:33 AM

డీకేటీ పట్టాలు సృష్టించి చెరువును

పూడ్చి చదును చేసిన టీడీపీ నేతలు

రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి

అన్యాక్రాంతం

చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: దశాబ్దాల కాలంగా అదొక గ్రామ చెరువు... ఆ చెరువు నీరే సుమారు వంద ఎకరాల ఆయకట్టుకు ఆయుపట్టు. అయితే ఆ చెరువు శ్రీకాళహస్తి పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో రోడ్డు పక్కన ఉండడంతో అధికార పార్టీ నాయకుల కన్నుపడింది. 2015లో డీకేటీ పట్టాలను చెరువులో ఇచ్చినట్లు పట్టాలను సృష్టించి వారం రోజులుగా ఏకంగా చెరువునే పూడ్చి, మట్టి తోలి చదును చేసి రియల్‌ వెంచర్‌గా మార్చేశారు. రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా అధికారులు అడ్డుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఏర్పేడు మండలం పాగాలి రెవెన్యూ పరిధిలో ఎస్‌ఈజడ్‌, అనేక పరిశ్రమలు వెలిశాయి. దీంతో ఇక్కడ భూముల రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పరిశ్రమల ఆనుకుని ఉన్న పాగాలి చిన్న చెరువుపై అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనాయకుడి కన్నుపడింది. సర్వే నం.163–1, 2, 5, 6,7లలో ఎన్‌.దొరస్వామి పేరుతో మొత్తం 4.5200 ఎకరాలు, సర్వే నంబరు: 163–3,4, 8,9లలో కె.సుబ్రమణ్యం పేరుతో 3.5100 ఎకరాలు డీకేటీ పట్టాలు పొందారు. ఆ పట్టాదారులను అడ్డు పెట్టుకుని చెరువునే కబ్జాకు తెగబడ్డారు. నిజంగా చెరువులో వీరికి డీకేటీ పట్టాలు మంజూరు చేసి ఉంటే పదేళ్లుగా సాగు చేయకుండా ఇప్పుడే ఎందుకు చదును చేసి వెంచర్‌గా మార్చారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో ఏర్పేడు తహసీల్దార్‌ రాజశేఖర్‌ అక్కడకు చేరుకుని పనులను నిలుపుదల చేశారు. అయితే తమ వద్ద అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నాయంటూ సదరు నాయకుడు చెరువు మొత్తం చదును చేసి పనులను పూర్తి చేశారు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

రియల్‌ వెంచర్‌గా మారిన పాగాలి చెరువు

Advertisement
 
Advertisement
Advertisement