రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు దుర్మరణం మరో మిత్రుడికి తీవ్ర గాయాలు
నారాయణవనం: వారందరూ కలిసి చదువుకున్నారు.. కలిసే పెరిగారు. కష్టసుఖాల్లో తోడుంటూ స్నేహానికి నిలువుటద్దంగా నిలిచారు. చివరికి మృత్యువు కూడా ఆ స్నేహబంధాన్ని విడదీయలేకపోయింది. విధి స్నేహితుల బంధాన్ని అర్ధంతరంగా ముగించే సింది. మిత్రులిద్దరూ మృత్యుఒడికి చేరడాన్ని తల్లిదండ్రులు, బంధువులు తట్టుకోలేక కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. శనివారం మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మిత్రులు అక్కడికక్కడే మృతి చెందగా మరో మిత్రుడు ఉదయ్ కుమార్ తీవ్ర గాయాలతో తిరుపతి రూయాలో చికిత్స పొందుతున్నాడు. ఎస్‌ఐ గిరిబాబు కథనం మేరకు .. గోవిందప్పనాయుడు కండ్రిగకు చెందిన మునికృష్ణయ్య కుమారుడు ఉదయ్‌కుమార్ (19), ఎస్ యువరాజ్ (17), కే యువరాజ్ (18) ముగ్గురు బాల్యం నుంచి మంచి స్నేహితులు. వీరు ఎక్కడికెళ్లినా కలిసి తిరిగేవారు, చదువుకునే వారు. శనివారం ఉదయ్‌కుమార్ తన మోటార్ సైకిల్‌పై ఇద్దరు మిత్రులతో కలిసి మండలంలోని సింగిరికోనకు వెళ్లారు. నారాయణవనం నుంచి పాత సర్వీస్ రోడ్డులో తమ గ్రామానికి మధ్యాహ్నం 2.20 గంటలకు తిరిగి బయలుదేరారు. మండలంలోని జాతీయ రహదారిలో బొప్పరాజుపాళెం బస్సు స్టాప్ వద్ద కలుసుకునే క్రమంలో పుత్తూరు నుంచి నాగలాపురం వైపు వెళుతున్న కారు వెనుక నుంచి మోటార్ సైకిల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు రోడ్డుపై పడిపోయారు. అదే సమయంలో తిరుపతి వైపు వెళుతున్న మరో కారు కిందపడిన యువరాజులిద్దరినీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో యువరాజులిద్దరూ ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. ఉదయ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఉదయ్‌కుమార్‌ను చికిత్స నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరిబాబు పేర్కొన్నారు.
గ్రామంలో విషాద ఛాయలు
చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులుగా మెలిగిన వారు ఇప్పుడు విగత జీవులవడం గోవిందప్పనాయుడు కండ్రిగలో విషాద ఛాయలు అలముకున్నాయి. తమ బిడ్డలు చావులోనూ ఒకటిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు స్థానికులను కలచివేసింది.


