పోటెత్తిన జనం | - | Sakshi
Sakshi News home page

పోటెత్తిన జనం

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

● భక్తులతో కిక్కిరిసిన గంగమ్మ ఆలయం ● భక్తి పారవశ్యంతో గంగమ్మకు పొంగళ్ల నివేదన ● గంగజాతర వేషాలతో పులకించిన తిరునగరి

గంగ రంగ వైభవం..

వైభవంగా గంగమ్మ జాతర సంబరాలు

తాతయ్యగుంట గంగమ్మ విశ్వరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తిరునగరిలో గంగమ్మజాతర వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆలయ ఆవరణలోని కొడిస్తంభానికి బంకమట్టితో గంగమ్మ విశ్వరూప ప్రతిమను తీర్చిదిద్దే పనిలో పలు సామా జిక వర్గాల వారు నిమగ్నమయ్యారు. ఆ రూపాన్ని దర్శించుకోవడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చి వేచి ఉన్నారు. దీంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.

గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

తిరుపతి కల్చరల్‌: శ్రీతాతయ్యగుంట గంగమ్మ జాతర తిరుపతిలో వైభవంగా జరిగింది. ఈ నెల 5వ తేదీ రాత్రి చాటింపుతో మొదలైన జాతర వారం రోజుల పాటు అత్యంత కోలాహలంగా సాగింది. రోజువారీ విభిన్న వేషాలతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నారు. మంగళవారం జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులతో గంగమ్మ ఆలయం కిక్కిరిసింది. సోమవారం అర్ధరాత్రి అమ్మవారికి మహాశాంతి అభిషేకం తర్వాత అమ్మవారి దర్శనం కోసం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో పొర్లుండాలతో ఆలయ ప్రదక్షిణ చేసి మొక్కులు తీర్చుకున్నారు. మొక్కుబడిలో భాగంగా వేపాకు చీరలతో గంగమ్మను దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. జాతర చివరి రోజు కావడంతో ఉదయం నుంచి రాత్రి వరకు విశేష సంఖ్యలో భక్తులు వివిధ పౌరాణిక, జానపద, సీ్త్ర వేషాలు ధరించి తిరుపతి వీధుల్లో కేరింతలతో విహరిస్తూ సందడి చేశారు. డప్పుల దరువుల నడుమ చిందులు వేస్తూ గంగమ్మ ఆలయానికి విచ్చేసి మొక్కులు చెల్లించారు. భక్తజనంతో గంగమ్మ ఆలయ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. గంగమ్మ దర్శనంలో భాగంగా ఆలయాధికారులు, పోలీసులు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పటిష్ట భద్రతా ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు గంగమ్మ తల్లిని దర్శించుకున్నారు. జాతరను పురస్కరించుకుని గంగమ్మ ఆలయం వద్ద భక్తులు మజ్జిగ, అంబళ్లు పంపిణీ చేశారు.

వివిధ వేషధారణలో భక్తులు

బారులు తీరిన భక్తులు

తాతయ్యగుంట గంగమ్మ జాతరలో చివరి రోజు మంగళవారం అర్ధరాత్రి తర్వాత అమ్మవారు విశ్వరూపం దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఆలయ ఆవరణలోని అమ్మవారి విశ్వరూప కొడిస్తంభం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంకమట్టితో సర్వాంగసుందరంగా అమ్మవారి విశ్వరూప ప్రతిమ కొలువు తీర్చే పనిలో పలువురు నిమగ్నమయ్యారు. అమ్మవారి విశ్వరూప ప్రతిమ తయారీలో కుమ్మరి, కంసాలి, విశ్వబ్రాహ్మణ, చాకలి, దళితులు తదితర సామాజిక వర్గాలవారు భక్తిప్రపత్తులతో అమ్మవారి విశ్వరూపాన్ని కొలువు తీర్చుతారు. అమ్మవారి విశ్వరూప ప్రతిమ చంపను పేరంటాల వేషధారుడు నరకడంతో జాతర సమాప్తం అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement