నీట్ రద్దుపై భగ్గుమన్న విద్యార్థి లోకం
నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్‌టీఏ విఫలం
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్
●
కేంద్రమంత్రి రాజీనామా చేయాలి
ఇంటర్ రెండేళ్లు పుస్తకాల పురుగులుగా మారి శ్రమించి నీట్ రాసిన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్‌టీఏని రద్దు చేయాలి. పేపర్‌ను లీక్ చేసి, రూ.కోట్లలో సొమ్ము చేసుకుంటున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. నీట్ లీకేజ్‌కి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. లేనిపక్షంలో ఉద్యమిస్తాం.
– చిన్న, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు, తిరుపతి
ఎన్‌టీఏని రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులను ఆట వస్తువులుగా చేసి చెలగాటమాడుతోంది. నీట్ పేపర్ లీక్ చేసి, రూ.కోట్లు దండుకుంటున్న ఎన్‌టీఏ అధికారులు, కేంద్ర విద్యామంత్రిత్వశాఖ పూర్తి బాధ్యత వహించాలి. తక్షణం ఎన్‌టీఏని రద్దు చేయాలి. రూ.లక్షలు వెచ్చించి కొన్ని ఏళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకోవడం దారుణం.
– అశోక్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు, తిరుపతి
విద్యావ్యవస్థ నిర్వీర్యం
కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి.నీట్ పేపర్ లీక్ కు కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాలి. ప్రతిష్టాత్మక నీట్‌ను సక్రమంగా నిర్వహించలేని దు స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఉండడం బాధాకరం. పరీ క్ష రద్దు కావడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. తక్షణం ఎన్‌టీఏని రద్దు చేయాలి.
– ప్రేమ్ కుమార్, వైఎస్సార్ సీపీ
విద్యార్థి విభాగం అధ్యక్షుడు, ఎస్వీయూ
తిరుపతి సిటీ: దేశవ్యాప్తంగా విద్యావ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తోందని, ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకమైన నీట్ ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయని విద్యార్థులు మండిపడుతున్నారు. గత మూడేళ్లుగా యూజీ నీట్ పరీక్ష వివాదాస్పదంగా మారుతున్నా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని మండిపడుతున్నారు. మే 3వ తేదీన జరిగిన నీట్ దేశవ్యాప్తంగా 22.79 లక్షల మంది రాశారని, వారి జీవితాలతో ఎన్‌టీఏ ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా పేపర్ లీక్ చేస్తూ అవినీతి ఊబిలో కూరుకుపోతున్నా పట్టించుకునే నాథుడే లేడని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తిరుపతి జిల్లాలో ఈ ఏడాది 4,542 మంది నీట్ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో సుమారు 60 శాతం మంది విద్యార్థులు సుదూర ప్రాంతాల్లో రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకుని పరీక్ష కాస్త మెరుగుగా రాశారని, కానీ పరీక్ష రద్దు కావడంతో విద్యార్థులు మానసికంగా కుంగిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీట్ రాసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నేతలు పరీక్ష రద్దుపై ఏమన్నారంటే..
ఏటా ఇదే తంతు
మా అబ్బాయి రెండేళ్లుగా విజయవాడలో నీట్‌కు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. గత ఏడాది 5 మార్కుల తేడాతో సీటు దగ్గరకు వచ్చి చేజారింది. ఈ ఏడాది 590 వరకు వస్తాయని నమ్మకంతో ఉన్నాం. కానీ పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్ష రద్దు కావడం మానసికంగా కుంగిపోతున్నాం. మళ్లీ పరీక్ష రాయాలంటే పేపర్ ఎలా వస్తుందో భయంగా ఉంది. ప్రతి ఏడాది పేపర్ లీక్ తంతు కొనసాగుతోంది. – సుశీలమ్మ, నీట్ విద్యార్థి తల్లి, తిరుపతి
విద్యార్థులపై మానసిక ఒత్తిడి
నీట్ రద్దు దారుణం. ఎన్‌టీఏ పరీక్షను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైంది. మా అమ్మాయి ఈ ఏడాది నీట్ రాసింది. ఏడాది కోచింగ్‌కు రూ.4 లక్షలు వెచ్చించాం. మాకు రిజర్వేషన్ ఉంది. మంచి మార్కులతో సీటు వస్తుందని ధైర్యంగా ఉన్నాం. కానీ పరీక్ష రద్దుతో ప్రతి విద్యార్థీ మానసిక ఒత్తిడికి గురయ్యారు.
– ప్రభాకర్‌రెడ్డి, నీట్ విద్యార్థి తండ్రి, తిరుపతి రూరల్
ఆశలన్నీ అడియాశలయ్యాయి
ఈ ఏడాది నీట్ బాగా రాశా. రూ.లక్షలు వెచ్చించి హైదరాబాద్‌లో పేరొందిన కోచింగ్ సెంటర్‌లో లాంగ్‌టర్మ్ కోచింగ్ తీసుకున్నా. కానీ లీకేజ్ పేరుతో నీట్ రద్దు చేశారు. 585కు పైగా మార్కులు వస్తాయని సంతోషంగా ఉన్నా. ఆశలన్నీ అడియాశలయ్యాయి. మళ్లీ పరీక్ష రాయలంటే అన్ని మార్కులు సాధిస్తాననే నమ్మకం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం దారుణం.
– శ్రీలత, నీట్ విద్యార్థిని, తిరుపతి
మళ్లీ రాయాలంటే భయంగా ఉంది
మే 3వ తేదీ జరిగిన నీట్ బాగా రాశాను. పేపర్ లీక్ కావడంతో ఎన్‌టీఏ పరీక్షను రద్దు చేసినట్లు ప్రకటించింది. దీంతో మళ్లీ పరీక్ష రాయాలంటే భయమేస్తోంది. పరీక్ష పేపర్ ఎలా వస్తుందోనని మనసులో భయంగా ఉంది. ఏమి చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నా. మళ్లీ ప్రిపరేషన్ ప్రారంభించాల్సిన పరిస్థితి. – శివ శంకర్, నీట్ విద్యార్థి, రేణిగుంట
వైద్యవిద్యలో ప్రవేశం ప్రస్తుత తరుణంలో ఆషామాషీ కాదు.. అయినప్పటికీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు లక్షలాది మంది సిద్ధమయ్యారు. తమ పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలన్న ఆకాంక్షతో తల్లిదండ్రులు తమ తహతకు మించి రూ.లక్షలు వెచ్చించి కోచింగ్ ఇప్పించారు. తమ బిడ్డలను వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఈ క్రమంలో విద్యార్థులు ‘నీట్’గా పరీక్ష రాశారు. అయితే కేంద్ర విద్యాశాఖ, ఎన్‌టీఏ నిర్లక్ష్యంతో పేపర్ లీక్.. ఫలితంగా లక్షలాది విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. విద్యార్థుల జీవితాలతో ఆటలా? అని నిలదీస్తున్నారు.
బిగ్ బాంబ్


