ఆకు రౌడీల ముసుగులో ఆక్రమణలు | - | Sakshi
Sakshi News home page

ఆకు రౌడీల ముసుగులో ఆక్రమణలు

May 13 2026 12:26 AM | Updated on May 13 2026 12:26 AM

నిజాయితీగా ఉన్న సీనియర్‌

జర్నలిస్టులకు నిలువ నీడలేదు

బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరెడ్డి

సాక్షి ప్రతినిధి, తిరుపతి: నిజాయితీ వార్తలు రాసే సీనియర్‌ జర్నలిస్టులకే నిలువ నీడలేదు.. జర్నలిస్టుల ముసుగులో ఆకు రౌడీలు స్థలాలు ఆక్రమిస్తున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకరరెడ్డి ధ్వజమెత్తారు. తిరుపతిలోని వైఎస్సార్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి రాష్ట్ర బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వాసు యాదవ్‌, రాష్ట్ర మున్సిపల్‌ విభాగం ఉపాధ్యక్షులు రామస్వామి వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి గోపాల్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నగరంలో ఆ పార్టీ శ్రేణులు విచ్చలవిడిగా చెలరేగిపోతున్నారన్నారు. నగరంలోని ఎర్రమిట్టలో రూ.కోట్లు విలువైన భూమిని ఆక్రమించుకునేందుకు.. టీడీపీ నాయకులు జర్నలిస్టుల పరిరక్షకులం అన్న పేరుతో వాళ్ల ఆకతాయి సైన్యం అంతా ఆక్రమణలకు తెగబడ్డారన్నారు. ఎక్కడ ఆక్రమించాలో అక్కడ వీళ్లు వాలిపోయి ఓనరుల్లాగా చెలామణి అవుతారని మండిపడ్డారు. మొన్న జరిగిన ఘటనలో ఆ స్థల యజమానులపై ఎన్ని రకాలైన బీభత్స కార్యక్రమాలు చేయాలో అన్ని రకాలుగా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతల తీరుని ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. ఎవరు నిజమైన జర్నలిస్టులో.. జర్నలిస్టు ముసుగేసుకుని ఎవరు నాటకాలాడుతున్నారో అందరికీ తెలుసనన్నారు. 30 ఏళ్లుగా జర్నలిజం వృత్తిలో అత్యంత నీతి నిజాయితీలతో వార్తలు రాసే వారు నిలువ నీడలేకుండా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆకు రౌడీల అండతో పేట్రేగిపోతున్న వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement