తిరుపతి అన్నమయ్యసర్కిల్: భూ సేకరణ పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. మంగళవారం స్ధానిక కలెక్టరేట్ మిని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావుతో కలసి భూ సంబంధిత పెండింగ్ పనుల పురోగతిపై పర్చువల్‌గా రెవెన్యూతోపాటు వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వానెల్లూరు, పాగలి, ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ కోర్టు కేసులు కూడా త్వరగా పరిష్కారం అయ్యేలా చూడాలన్నారు. వెబ్ ల్యాండ్‌పై ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా చేపడుతున్న జాతీయ రహదారుల నిర్మాణ పనులు, వైజాగ్– చైన్నె కారిడార్ పైపు లైను పనులు, రైల్వే ప్రాజెక్ట్స్ పనులు పూర్తి చేయాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జి.నరసింహులు, తిరుపతి, శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట ఆర్డీఓలు రామ్మోహన్, భానుప్రకాష్ రెడ్డి, దేవేంద్ర రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు భరత్ నాయక్, అనురాధ, రోజ్ మాండ్, ల్యాండ్ అండ్ సర్వే రికార్డు లు అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ కుమార్, ఏపీఐఐసీ తిరుపతి, నెల్లూరు జోనల్ మేనేజర్లు విజయ్ భరత్‌రెడ్డి, ఎల్. శివకుమార్, శ్రీ సిటీ జనరల్ మేనేజర్ భగవాన్, తహసీల్దార్లు, డీటీలు, సెక్షన్ ఆధికారులు భాస్కర్, చంద్రశేఖర్, భార్గవి, శివప్రసాద్ పాల్గొన్నారు.


