టౌన్‌బ్యాంకుపై పచ్చపాతం | - | Sakshi
Sakshi News home page

టౌన్‌బ్యాంకుపై పచ్చపాతం

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

ఎండీ చాంబర్‌ ముట్టడి..

డైరెక్టర్లపై దుర్భాషలు

వినియోగదారుల్లో భయం

శతాబ్ద చరిత్ర దెబ్బతీసే కుట్ర

ఆ బ్యాంకుది శతాబ్ద చరిత్ర.. తిరునగరిలో ఎందరో ఉద్యోగులకు జీవనాధారం.. వేలాది మంది ఖాతాదారులకు ఆర్థికంగా అండ.. అయితే నేడు దానిపై ‘పచ్చ’పాతం. ఉద్దేశపూర్వకంగా బ్యాంకులో గోల.. అరుపులు.. దూషణలు.. వెరసి డిపాజిటర్లు, ఖాతాదారుల్లో ఆందోళన, భయం.. శతాబ్ద చరిత్ర ఎక్కడ దెబ్బతింటుందోనని ఆందోళన.. ఇదీ నేడు తిరుపతి కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ దుస్థితి.

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: 108 ఏళ్ల చరిత్ర కలిగిన తిరుపతి కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగుల పేరుతో కొందరు వ్యక్తులు బ్యాంకు పరిపాలనను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలకు దిగారని షేర్‌ హోల్డర్లు, డిపాజిటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు ఎండీ చాంబర్‌లోకి అనుమతి లేకుండా దూసుకెళ్లిన కొందరు ఉద్యోగులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, పాలకమండలిని అవమానించేలా అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని సమాచారం. సాధారణంగా ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు రౌడీల్లా ప్రవర్తించడం బ్యాంకుకు వచ్చిన ఖాతాదారులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. బ్యాంకు హాలులో పెద్దఎత్తున గోల చేస్తూ ‘చేతకాని పాలకమండలి దిగిపోవాలి’ అంటూ అరుపులు, దూషణలతో హంగామా సృష్టించిన ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు తెలిసింది.

రూ.4 వేల జీతం కోసం పనిచేస్తున్నారా?

బ్యాంకు డైరెక్టర్లు కేవలం రూ.4 వేల జీతం కోసం పనిచేస్తున్నారంటూ ఉద్యోగులే బహిరంగంగా దూషించారని షేర్‌ హోల్డర్లు మండిపడుతున్నారు. పరిపాలనపై విమర్శలు చేయడం వేరు కానీ, సంస్థ గౌరవాన్ని దిగజార్చేలా వ్యవహరించడం వెనుక దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందని వారు అంటున్నారు.

ఉద్యోగం చేయకుండా జీతాలు?

46 రోజులుగా బ్యాంకు లోపల, బయట నిరసనల పేరుతో ఉద్యోగులు విధులను పక్కన బెట్టి ఆందోళనలు చేస్తున్నారని, అయినప్పటికీ రెండు నెలలుగా జీతాలు తీసుకుంటున్నారని పలువురు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. సాధారణ కస్టమర్లు సేవల కోసం బ్యాంకుకు వస్తే, గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొనడంతో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది.

డిపాజిటర్లలో భయం

బ్యాంకులో నిత్యం నిరసనల కారణంగా డిపాజిటర్లు కూడా వెనక్కి తగ్గే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా కొనసాగితే బ్యాంకు ప్రతిష్ట దెబ్బతింటుందని, ప్రజల నమ్మకం కోల్పోతుందని పలువురు షేర్‌ హోల్డర్లు ఆందోళన వ్యక్తం చేశారు.

108 ఏళ్ల వారసత్వాన్ని కాపాడేదెవరు?

స్వాతంత్య్రం రాక ముందే ప్రారంభమైన ఈ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ వేలాది కుటుంబాలకు అండగా నిలిచింది. అలాంటి సంస్థను కొందరి రాజకీయ ఆశల కోసం బలి చేయాలని చూస్తున్నారని ఖాతాదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకును కాపాడాల్సిన ఉద్యోగులే బ్యాంకు ప్రతిష్టను వీధికీడ్చడం బాధాకరమని అంటున్నారు. రాజకీయ ప్రేరేపిత శక్తులు వెంటనే ఆగాలని డిపాజిటర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

తిరుపతి కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లో టీడీపీ దాష్టీకమా?

టీడీపీ రాజకీయాల కోసం బ్యాంకు వేదిక?

ఈ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు టీడీపీ నాయకుల ప్రోత్సాహంతోనే ఉద్యోగులు ఇంత దూకుడుగా వ్యవహరిస్తున్నారని బ్యాంకు వర్గాల్లో చర్చ జరుగుతోంది. బ్యాంకు చైర్మన్‌ పదవిపై కన్నేసిన మాజీ చైర్మన్‌ వర్గమే ఈ ఉద్రిక్తతలకు తెరలేపిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కొందరు ఉద్యోగులే బయట నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని అనధికారికంగా చెప్పడం గమనార్హం. దీంతో బ్యాంకు పరిరక్షణ పేరుతో మొదలైన ఆందోళన ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపుగా మారిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement