రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారి పడి గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

May 13 2026 12:14 AM | Updated on May 13 2026 12:14 AM

● వేణుంబాకంలో ఆత్మహత్యాయత్నం ● లొకేషన్‌ ట్రేస్‌ ఔట్‌ చేసి రక్షించిన వైనం

దొరవారిసత్రం: గుర్తు తెలియని సుమారు 35 ఏళ్లు వయస్సు కలిగిన ఓ వ్యక్తి రైలు నుంచి జారి పడిపోయిన మృతి చెందిన ఘటన పోలిరెడ్డిపాళెం రైల్వేస్టేషన్‌కు సమీపంలో సోమవారం రాత్రి చోటు చేసుకోగా మంగళవారం వెలుగు చూసింది. స్థానిక రైల్వే గ్యాంగ్‌ సిబ్బంది, జీఆర్పీ పోలీసుల కథనం మేరకు.. చైన్నె వైపు వెళ్లే గుర్తుతెలియని రైలు నుంచి జారి పడిపోయి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడు వద్ద ఎలాంటి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎర్రచందనం కేసులో

ఒకరికి ఐదేళ్లు జైలు

తిరుపతి లీగల్‌: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, జమునా మత్తూరు తాలూకాకు చెందిన పెరుమాళ్‌ గోపాల్‌కు ఐదేళ్లు జైలుశిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి మంగళవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు.. తిరుపతి ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం (టాస్క్‌ఫోర్స్‌) 2019లో శేషాచలం, కరకంబాడి ఫారెస్ట్‌ బీట్‌, కృష్ణాపురం సెక్షన్‌, ఎస్వీఎన్పీ చామల రేంజ్‌ అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించింది. నిందితుడు గోపాల్‌ అటవీ ప్రాంతంలోకి అక్రమంగా ప్రవేశించి ఎర్రచందనం చెట్లను నరికి దుంగలుగా మార్చి తరలించడానికి ప్రయత్నిస్తుండగా ఫారెస్ట్‌ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. అతనిపై నేరం రుజువు కావడంతో అతనికి శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో

ట్రాక్టర్‌ డ్రైవర్‌ మృతి

దొరవారిసత్రం: ప్రమాదశాత్తు ట్రాక్టర్‌ బోల్తా కొట్టడంతో దాని కింద పడి డ్రైవర్‌ మృతి చెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల, పోలీసుల కథనం మేరకు.. దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీకాలనీ చెందిన కలింబాకం చెంగయ్య(29) ట్రాక్టర్‌లో నాయుడుపేటకు షామియానా, కుర్చీలు తీసుకువెళ్లి అక్కడ అన్‌లోడ్‌ చేసి తిరిగి వస్తున్న క్రమంలో నెలబల్లి సమీపంలో ట్రాక్టర్‌ అదుపుతప్పి జాతీయ రహదారి మధ్యలోని డివైడర్‌ను ఢీకొనడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ను నడుపుతున్న చెంగయ్య ట్రాక్టర్‌ కిందనే పడి తీవ్ర గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి ప్రాణాలు కాపాడిన పోలీసులు

దొరవారిసత్రం: మండలంలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని మంగళవారం పోలీసులు రక్షించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. వేణుంబాకం గ్రామానికి చెందిన షేక్‌ సలాం(28)కు, అతని భార్యతో కొంత కాలంగా వివాదాలు తలెత్తాయి. దీంతో అతని భార్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను ఇంటి రావాలని ఎన్నిసార్లు పిలిచినా రాకపోవడంతో సలాం మనస్తాపం చెందాడు. పంట పొలాలకు పిచికారి చేసే పురుగుల మందు, మద్యం సీసా తీసుకుని గ్రామానికి దూరంగా వెళ్లాడు. తొలుత ఎడమ చేయి కోసుకున్నాడు. తరువాత మద్యంలో పురుగుల మందు కలుపుకుని తాగి ఆత్యహత్యకు యత్నిస్తూ ఫొటోలను తీసుకుని చనిపోతున్నట్లు అతని బంధువులకు పంపాడు. అతను ఎక్కడ ఉన్నడో తెలియక సలాం పంపిన ఫొటోలను అతని బంధువులు దొరవారిసత్రం పోలీసులు పంపారు. అతని సెల్‌ఫోన్‌ లోకేషన్‌ను పోలీసులు గుర్తించారు. వెంటనే అతను ఉన్న స్థలానికి అంబులెన్స్‌ను తీసుకువెళ్లి అతనిని చికిత్స నిమిత్తం నాయుడుపేటలో ప్రైవేటు ఆస్పత్రి తరలించారు. సలాం ఆరోగ్యం పరిస్థితి కుదుట పడినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement