తిరుపతి సిటీ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలలో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఈఏపీసెట్–2026 (ఎంసెట్) జిల్లాలో మంగళవారం ప్రశాంతంగా జరిగింది. తిరుపతి రేణిగుంట రోడ్డులోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాల, కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాల, అన్నమయ్య కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, జూపార్క్ సమీపంలోని అయాన్ డిజిటల్ సెంటర్, పుత్తూరు శ్రీవెంకటేశ పెరుమాల్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలోని 5 పరీక్ష కేంద్రాల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు జరిగిన తొలిరోజు పరీక్షకు 96.50 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఉదయం 9 నుంచి 12గంటల వరకు నిర్వహించిన తొలి సెషన్‌లో 616 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 592 మంది పరీక్ష రాశారన్నారు. అలాగే మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 1,331 మందికి గాను 1,287 మంది అభ్యర్థులు హాజరైనట్లు తెలిపారు. రెండో రోజు బుధవారం జిల్లాలో ఏర్పాటు చేసిన 5 పరీక్ష కేంద్రాల్లో మరో 1,450 మంది వరకు పరీక్షకు హాజరవుతారని వెల్లడించారు.
మృతదేహం కోసం నిరీక్షణ
సైదాపురం: మనుబోలు జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదాపురం గ్రామానికి చెందిన కొత్తలూరు కళ్యాణ్(23) మృతదేహం కోసం బంధువులు మంగళవారం రాత్రి వరకు నిరీక్షించారు. పోస్టుమార్టం అలస్యం కావడంతో బుధవారం మృతదేహాన్ని అప్పగిస్తారనే సమాచారం అందడంతో బంధువులు, కుటుంబ సభ్యులు తిరుగుముఖం పట్టారు. మండలంలోని రాగనరామాపురం గ్రామానికి చెందిన కొత్తలూరు శేఖర్ పనులు చేసుకుని జీవించేవాడు. కొంత కాలం నుంచి రాగనరామాపురం నుంచి వచ్చి సైదాపురం ఎస్టీ కాలనీలో కాపురం ఉంటున్నారు. ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటున్న కళ్యాణ్(23) డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబానికి అండగా ఉండేవాడు. ఈ నేపథ్యంలో మనుబోలు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కళ్యాణ్ మృతి చెందాడు. దీంతో కల్యాణ్ మృత దేహాన్ని పోస్టుమార్టానికి గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కాగా మంగళవారం రాత్రియినా మృతదేహం అప్పగించకపోవడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కళ్యాణ్ మృతదేహం కోసం నిరీక్షించారు. కాని మృతదేహం రాకపోవడంతో తిరుగుముఖం పట్టారు. బుధవారం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగిస్తారని తెలిసింది. చిన్నవయస్సులోనే కళ్యాణ్ మృతి చెందడంతో ఆకుటుంబంలో పెను విషాదం నెలకొంది.


