తిరుపతి కల్చరల్: సున్నపు కుండలు వేషంలో పెద్ద గంగమ్మ, చిన్నగంగమ్మలైన అక్కాచెల్లెళ్లు తిరుపతి ప్రజల కు కై కాల వారు వేసే ఈ వేషాల్లో దర్శనమిస్తారు. ఈ మేరకు మంగళవారం గంగమ్మల వేషధారణలో ఉన్న కై కాల వారు ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి ఇంగ్లిషులో రచించిన ‘ది ఫోక్ ఫెస్టివల్ ఆఫ్ గంగ జాతర ఇన్ తిరుపతి’ గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గంగమ్మలు ఆవహించిన కై కాల వారు మాట్లాడుతూ పేటశ్రీ 30 ఏళ్లకు ముందే తెలుగులో ‘తిరుపతి గంగజాతర ’ అనే పుస్తకాన్ని రెండు ఎడిషన్లు ప్రచురించారని, ద్రావిడ విశ్వవిద్యాలయం వారు ఇంగ్లిషులో ఆయన రాసిన 120 పేజీల పుస్తకాలను కూడా ప్రచురించి తిరుపతి గంగమ్మలకు ఎంతో సేవ చేశారన్నారు. ఆచార్య పేటశ్రీ మాట్లాడుతూ తాను తిరుపతిలో పుట్టి పెరిగానని, మన గంగమ్మ జాతరను ప్రపంచానికి తెలిజేసే ప్రయత్నం చేశానని తెలిపారు. ప్రస్తుతం తాను రచించిన ఈ ఇంగ్లిషు గ్రంథంలో వందేళ్లకు ముందు జాతర ఎలా ఉందో?, ఇప్పుడు ఎలా ఉందో? కొత్తగా రాసిన అధ్యాయంలో వివరించానన్నారు. భవిషత్తులో తమిళ, కన్నడ భాషల్లో కూడా ‘ తిరుపతి గంగజాతర ’ పుస్తకాన్ని ఆ గంగమ్మ తల్లి చలువతో వెలువరిస్తానని చెప్పారు. గంగమ్మల చేతుల మీదుగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు.


