● రాత్రుల్లో చోరీకి పాల్పడే దొంగను అరెస్టు చేసిన తిరుచానూరు పోలీసులు ● రూ.8లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం ● వివరాలను వెల్లడించిన సీఐ సునీల్ కుమార్
దొంగ అరెస్టు
చంద్రగిరి: తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన చోరీల కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సీఐ సునీల్ కుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. తిరుపతి జీవకోన, నవజీవన కాలనీలో ఉంటున్న వరదరాజుల మణి జల్సాలకు అలవాటు పడి ఎవరూ లేని ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడేవాడు. ఈ క్రమంలో మార్చి 27వ తేదీన మంగళం తుడా క్వార్టర్స్‌లోని ప్లాట్ నంబర్ 51లో కాపురమున్న వెంకటేష్ బంధువుల ఇంట్లో శుభకార్యానికి కుటుంబ సభ్యులతో కలసి వెళ్లాడు. ఈ విషయం గుర్తించిన వరదరాజుల మణి 29వ తేదీన పథకం ప్రకారం ఇంట్లోకి చొరబడి బీరులోని ఉంచి 57 గ్రాముల బంగారు ఆభరణాలు, 512 గ్రాముల వెండి ఆభరణాలను దోచుకెళ్లాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తుల కదలికల గురించి విచారణ చేపట్టడంతో పాటు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మంగళం సమీపంలోని ఆశ కల్యాణ మండపం సమీపంలో వరదరాజుల మణిను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించడంతో సుమారు 3 ఇళ్లలో చోరికి పాల్పడినట్లుగా తేలింది. గత ఏడాది నవంబర్‌లో జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన మణి తిరిగి చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని సీఐ సునీల్ కుమార్ తెలిపారు. అలిపిరి, తిరుచానూరు పోలీసు స్టేషన్ పరిధిలో 3 ఇళ్లలో చోరీలు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిపై తిరుచానూరు, అలిపిరి, సీసీఎస్, తిరుపతి రూరల్ పోలీసు స్టేషన్లలో 19 కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామన్నారు. చోరీ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ సునీల్ కుమార్, ఎస్‌లు, క్రైం సిబ్బంది ప్రభాకర్, ప్రసాద్, షఫీలను ఎస్పీ అభినందించి వారికి నగదు రివార్డులను అందజేశారు.


