తిరుపతి కల్చరల్: తాతయ్య గుంట గంగమ్మను మంగళవారం జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు శాస్త్రోక్తంగా పూజలు చేసి, మ్మవారి హారతి, తీర్థప్రసాదాలు జిల్లా కలెక్టర్‌కు అందజేశారు. అమ్మవారి దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయం వద్ద ఏర్పాట్లు, కమాండ్ కంట్రోల్ రూమ్‌ను మున్సిపల్ ఇన్‌చార్జ్ కమిషనర్ శారదాదేవి, గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్‌లతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భక్తులకు మంచి దర్శన భాగ్యం కల్పించేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. ప్రభుత్వ లాంఛనాలతో ఏటా మున్సిపల్ కార్పొరేషన్, తుడా, టీటీడీ వారి సహకారంతో తిరుపతిలో గంగమ్మ జాతరను జరుపుకుంటున్నారన్నారు. జాతర ఏర్పాట్లపై నెల రోజుల నుంచి జిల్లా స్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్ష చేశామన్నారు. జాతర సందర్భంగా ప్రత్యేక ఉత్సవ కమిటీని కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బందోబస్తు, కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. ఎండ తీవ్రత నేపథ్యంలో భక్తులకు తాగునీరు, మజ్జిగ పంపిణీ తదితర సదుపాయాలను దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేశారని తెలిపారు. గంగమ్మను దర్శించుకుని ఆశీస్సులు పొందడం ఎంతో సంతోషంగా ఉందని, ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ ఏ.జయకుమార్, దేవదాయ శాఖాధికారులు రామకృష్ణారెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.


