చంద్రగిరి: పరీక్షలు సరిగ్గా రాయలేదనే కారణంగా భయపడి ఎవరికీ చెప్పకుండా గోడ దూకి పారిపోయిన విద్యార్థి ఆచూకీని తిరుచానూరు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు గోవాలోని వాస్కోలో బాలుడిని పోలీసులు సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. గీతం జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువున్న జస్వంత్ రెడ్డి మార్చి 12వ తేదీన ఎవరికీ చెప్పకుండా కళాశాల నుంచి వెళ్లిపోయాడు. ఆ కాలేజీ ప్రిన్సిపల్ ఈ విషయమై తిరుచానూరు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రత్యేక బృందాల గాలింపు, సాంకేతిక ఆధారాలతో జస్వంత్ రెడ్డి గోవాలోని వాస్కో ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే పోలీసు బృందం మంగళవారం వాస్కోకు చేరుకుని, అక్కడి పోలీసుల సహకారంతో బాలుడిని సురిక్షతంగా అదుపులోకి తీసుకున్నారు. బాలుడిని విచారించగా ఇంటర్ ఫైనల్ పరీక్షలు సరిగ్గా రాయకపోవడంతో భయపడి ఎవరికీ చెప్పకుండా వచ్చేసినట్లు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. అనంతరం బాలుడిని పోలీసులు తిరుచానూరుకు తీసుకొచ్చేందుకు సన్నద్ధమయ్యారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ విద్యార్థులపై అధిక ఒత్తిడి తీసుకురాకుండా తల్లిదండ్రులు, విద్యాసంస్థలు వారి మానసిక స్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి, వారిని ప్రోత్సహించాలని, ఏదైనా సమస్య ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులతో లేదా ఉపాధ్యాయులతో మాట్లాడేలా అవగాహన కల్పించాలని సూచించారు.


