తిరుపతి క్రైం: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 55 ఫిర్యాదులు అందినట్టు ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఇందులో చోరీలు, ఆస్తి తగాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నాయన్నారు.
వెకేషన్ కోర్టు
షెడ్యూల్ విడుదల
తిరుపతి లీగల్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అత్యవసర సివిల్ కేసులు దాఖలు చేసుకోవడానికి ఏర్పాటైన వెకేషన్ కోర్టు ఏ ఏ ప్రాంతాల్లో, ఏ ఏ తేదీల్లో విధులు నిర్వహిస్తుందన్న షెడ్యూలను వెకేషన్ కోర్టు జడ్జి, మదనపల్లి రెండో అదనపు జిల్లా జడ్జి పీవీఎస్ సూర్యనారాయణమూర్తి సోమవారం విడుదల చేశారు. ఈనెల 13, 20 తేదీల్లో చిత్తూరులోనూ, ఈనెల 14, 25వ తేదీల్లో తిరుపతిలో, ఈనెల 12, 15, 19, 21, 26 తేదీలు మదనపల్లిలోను, ఈనెల 18వ తేదీ పీలేరులోనూ, ఈనెల 22వ తేదీ శ్రీకాళహస్తిలో విధులు నిర్వహించనున్నట్టు షెడ్యూల్లో పేర్కొన్నారు. ఈనెల 11వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జడ్జి సూర్యనారాయణ మూర్తి వెకేషన్ కోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వహించనున్నారు.
ముగిసిన ఏపీపీజీసెట్
తిరుపతి సిటీ: రాష్ట్ర వ్యాప్తంగా ఎస్వీయూ ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరిగిన ఏపీ పీజీసెట్–2026 సోమవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాలో 23 పరీక్ష కేంద్రాల్లో జరిగిన పీజీసెట్ ప్రశాంతంగా ముగిసిందని కన్వీనర్ ప్రొఫెసర్ పద్మావతి ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం మూడు సెషన్లలో 13 సబ్జెక్టులకు సంబంధించి ప్రవేశ పరీక్ష జరిగిందని, 88 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. నాలుగు రోజులుగా జరిగిన పరీక్షలకు 19,118 మంది హాజరు కావాల్సి ఉండగా 16,406 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. దీంతో పీజీసెట్–2026 పరీక్షకు మొత్తం 85.8 శాతం హాజరు నమోదైందని, ఫలితాలు ఈనెలాఖరులోపు వెల్లడించి అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ముక్కంటి సేవలో హైకోర్టు జడ్జి
శ్రీకాళహస్తి: జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరస్వామివారిని సోమవారం ఏపీహైకోర్టు జడ్జి కిరణ్మయి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. దక్షిణ గోపురం వద్ద బీకే వెంకటేశులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం వేదపండితులు వారిని ఆశీర్వదించి, స్వామి అమ్మవార్ల జ్ఞాపిక, తీర్థప్రసాదాలు అందజేశారు. స్థానిక న్యాయమూర్తి కృష్ణప్రియ పాల్గొన్నారు.
ఎస్వీయూలో పదోన్నతులు
తిరుపతి సిటీ: ఎస్వీయూలో నాన్‌టీచింగ్ ఉద్యోగులకు పదోన్నతులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సోమవారం ముగ్గురు టెక్నికల్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించారు. అలాగే బుధవారం మరో ఏడుగురు నాన్‌టీచింగ్ ఉద్యోగులకు వర్సిటీ అధికారులు పదోన్నతులు కల్పించనున్నట్లు సమాచారం. బి.మనోజ్ కుమార్ సింగ్‌కు సీనియర్ మెకానిక్ నుంచి ఫోర్‌మెన్‌గా పదోన్నతి లభించింది. ఆయనను నాన్‌టీచింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీధర్, సుబ్రమణ్యం, సభ్యులు ఘనంగా సన్మానించారు.
భవిత సెంటర్‌ను
సద్వినియోగం చేసుకోండి
తిరుపతి కల్చరల్: బైరాగిపట్టెడలోని ఎంజీఎం హైస్కూల్ ఉన్న భవిత సెంటర్‌ను దివ్యాంగ పిల్లలు సద్వినియోగం చేసుకోవాలని సహిత విద్య సమన్వయకర్త చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ప్రత్యేక అవసరాలు ఉన్న బడి ఈడు పిల్లల కోసం ఐఈఆర్టీ బి.జ్ఞానమ్మ నెహ్రూ నగర్, చిన్నగుంట, కుమ్మరితోపు ప్రాంతాల్లో సర్వే చేస్తున్నారు. ఆయన సర్వేను తనిఖీ చేశారు.


