‘యువికా–2026’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘యువికా–2026’ ప్రారంభం

May 12 2026 5:48 AM | Updated on May 12 2026 5:48 AM

సూళ్లూరుపేట: దేశంలోని యువతను ఇస్రోలో యువశాస్త్రవేత్తలుగా తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఏటా నిర్వహిస్తున్న యువత ప్రోగ్రామ్‌ యువికా–2026 కార్యక్రమాన్ని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి చైర్మన్‌ డాక్టర్‌ కే నారాయణన్‌ వర్చువల్‌ పద్ధతిలో సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. సోమ వారం నుంచి ఈనెల 22 వరకు ఇస్రోలోని సతీష్‌ధవన్‌ స్పేస్‌ సెంటర్‌తో సహా ఏడు కేంద్రాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా షార్‌లోని బ్రహ్మ ప్రకాష్‌హాలులో ఈ కార్యక్రమానికి విచ్చేసిన విద్యార్థుల నుద్దేశించి షార్‌ శాస్త్రవేత్తలు ప్రసంగించారు. షార్‌లో జరుగనున్న యువికా–2026 కార్యక్రమంలో 57 మంది విద్యార్థులు పాల్గొంటుండగా ఇందులో 30 మంది బాలురు, 27 మంది బాలికలను ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 15 మంది, మధ్యప్రదేశ్‌ నుంచి 14, చత్తీష్‌గడ్‌ నుంచి 14, ఒడిశా నుంచి 14 మంది పదిరోజుల పాటు షార్‌లో నిర్వహించే శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ పది రోజుల పాటు సీనియర్‌ శాస్త్రవేత్తల ఉపన్యాసాలు, షార్‌లోని వివిధ విభాగాలను సందర్శించడం, చిన్న రాకెట్‌ నమూనాలు, రోవర్‌ కిట్‌ల రూపకల్పన, నక్షత్రాలను వీక్షించడం, యోగా కార్యక్రమాలను కూడా పొందపరిచి నిర్వహించనున్నారు. ఈనెల 22న నిర్వహించబోయే ముగింపు కార్యక్రమంలో విద్యార్థులకు జ్ఞాపికలు, పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు ఇచ్చి యువికా కార్యక్రమాన్ని ముగిస్తారు. సోమవారం నాటి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్‌ డాక్టర్‌ కే నారాయణన్‌ వర్చువల్‌ విధానంలో మాట్లాడుతూ దేశంలో యువత ఎక్కువ ఉందని, ఇందులో బాగా చదువుకుని ఇస్రోలోకి భావి శాస్త్రవేత్తలుగా రావాలని పిలుపునిచ్చారు. శాస్త్రవేత్తలుగా దేశానికి సేవలు అందించాలని తద్వారా గౌరవాన్ని పొందుతారన్నారు. భవిష్యత్తులో ఇస్రో నుంచి వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా గగన్‌యాన్‌ ప్రాజెక్ట్‌ను చేపట్టామని మరీ చెప్పారు. ఈకార్యక్రమంలో షార్‌ డైరెక్టర్‌ ఈఎస్‌ పద్మకుమార్‌, కంట్రోలర్‌ రమేష్‌బాబు, ఎంఎస్‌ఎం గ్రూప్‌ డైరెక్టర్‌ గోపీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement