సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి అర్బన్ మండలం అక్కారంపల్లి రెవెన్యూ ఎర్రమిట్ట భూమిపై నగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జర్నలిస్టుల ముసుగులో రూ.కోట్లు విలువైన భూమి ఆక్రమణలో పాత్రదారులు, సూత్రదారుల్లో టీడీపీ, జనసేన, మరి కొందరు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వివాదాస్పద భూమికి సంబంధించి మొత్తం 28 మందికి పట్టాలు సిద్ధం చేశారని జర్నలిస్టులు చెబుతున్న మాట. అందులో జర్నలిస్టుల ముసుగులో టీడీపీ, జనసేనకు చెందిన ముఖ్య నాయకులు బినామీ పేర్లతో పట్టాలు సిద్ధం చేసుకున్నారని చర్చ జరుగుతోంది. ఎర్రమిట్టలో ఆదివారం అంత పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నా.. అధికార యంత్రాంగం అటువైపు తొంగి చూడకపోవటానికి కారణాల గురించి జర్నలిస్టులు ఆరా తీస్తున్నారు. తిరుపతి అర్బన్ మండలం అక్కారంపల్లి రెవెన్యూ సర్వే నంబర్ 101/3లోని సుమారు ఎకరం భూమి విషయంలో సోమవారం తీవ్ర వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఓ జర్నలిస్ట్ సోమవారం రాత్రి చేసిన పోస్ట్‌పై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 20 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇప్పటి వరకు సెంటు స్థలం కూడా లేదని, అటువంటి వారిని పక్కనపెట్టి టీడీపీ, జనసేనకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులకు మాత్రమే ఇళ్ల స్థలాలు ఇవ్వటం ఏమిటని సీనియర్లంతా సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు. ఎర్రమిట్టలోని విలువైన భూమి విషయంలో అధికారుల సహకారంతోనే ఆక్రమణకు యత్నించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 28 మందిలో టీడీపీ, జనసేనకు అనుకూలంగా ఉన్న జర్నలిస్టులు కొందరికి ఇచ్చి.. మిగిలిన స్థలాన్ని పార్టీ నాయకులు నివాసాలు నిర్మించుకునేందుకు పథకం వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ భూ వివాదం అమరావతికి చేరినట్లు సమాచారం. జిల్లా అధికారులు కూడా పునరాలోచనలో పడినట్లు ప్రచారం జరుగుతోంది.
ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో ఏడాది కాలంగా రౌడీ మూకలు రెచ్చిపోతున్నారు. రూ.కోట్లు విలువ చేసే భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎర్రమిట్టలో జరుగుతున్న దౌర్జన్యంపై స్థానికులు ఫొటోలు, వీడియోలు తీస్తుంటే రౌడీలు గుంపుగా వచ్చి బెదిరిస్తున్నా పట్టించుకునేవారు కరవయ్యారు. దౌర్జన్యంగా ఇళ్లు కూల్చేస్తున్నా పోలీసులు ఎక్కడికి వెళ్లారో అర్థం కావడం లేదు. టీడీపీ నాయకులు చెబితేనే రక్షణ కల్పిస్తారా? భూములు కోల్పోయిన పేదల పక్షాన వైఎస్సార్ సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం చేయటం కోసం పోరాటం చేస్తాం.
– భూమన అభినయరెడ్డి, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త.


