భూ ఆక్రమణకు యత్నం గోడౌన్‌గా మారిన సచివాలయం చోద్యం చూస్తున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు
రేణిగుంట: మండలంలోని తూకివాకం పంచాయతీలోని పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి పక్కనే 928, 929 సర్వే నంబర్‌లో కాలువ యథేచ్ఛగా ఆక్రమణ జరుగుతున్న ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదని స్థానికులు వాపోతున్నారు. జిల్లా కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలో ఈ తంతు జరుగుతున్న అధికారులు మాత్రం తమకేమీ కనిపించడం లేదన్న చందంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో చిన్న ఇల్లు నిర్మించుకుంటేనే రెవెన్యూ అధికారులు నానా హంగామా చేస్తున్నారని, వారి కళ్లముందే ఇంత జరుగుతున్నా కనీస చర్యలు తీసుకోకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి కాలువ ఆక్రమణ జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ శ్యాం ప్రసాద్‌ను వివరణ కోరగా సిబ్బందిని పంపి, పరిశీలించి ఆక్రమణ జరుగుంటే చర్యలు చేపడతామన్నారు.
సచివాలయ భవనమే గోడౌన్
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో గ్రామీణ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని రూ.40 లక్షల వ్యయంతో సచివాలయ భవనాలను నిర్మించారు. సచివాలయ భవనం 90 శాతం పూర్తయినప్పుటికీ మిగిలిన పనులు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం వదిలేసింది. తూకివాకం సచివాలయ భవనానికి ప్రైవేట్ వ్యక్తులు తలుపు అమర్చుకుని గోడౌన్ వినియోగిస్తున్నారు. నివారించాల్సిన పంచాయతీ అధికారులు స్థానిక అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో ఉన్నారని గ్రామస్తులు అంటున్నారు.
పత్తాలేని ఇరిగేషన్ అధికారులు
పంట కాలువలను పరిరక్షించాల్సిన ఇరిగేషన్ అధికారులు అటువైపు చూడకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. కాలువ ఆక్రమణకు గురవుతుందని స్థానికులు తెలిపినా ఇరిగేషన్ అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు విమర్శిస్తున్నారు.
కాలువలో తోలిన మట్టి
పెడచెవిన వీఆర్వో మాటలు
వారం కిందట స్థానిక వీఆర్వో, సచివాలయ సర్వేయర్‌తో కలిసి కాలువను సర్వే చేశారు. సర్వే రిపోర్ట్ వచ్చేంతవరకు నిర్మాణ పనులు చేపట్టవద్దని ఆదేశించారు. కానీ వీఆర్వో మాటను ఆక్రమణలు లెక్కచేయకుండా పనులు శరవేగంగా చేస్తున్నారు. వీఆర్వోకు తెలిసే పనులు చేస్తున్నారా? లేక ఆయన్ని లెక్కచేయకుండా చేస్తున్నారా? అన్నది శేష ప్రశ్నగా మిగిలింది.
ఖాళీ స్థలం కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. ప్రభుత్వ స్థలాల్లో పాగా వేస్తున్నారు. రూ.కోట్ల విలువ చేసే స్థలాలపై కన్నేస్తున్నారు. ఆక్రమణలకు కొంత మంది నాయకుల అండదండలుండడం.. అధికారులు ఉదాశీనంగా వ్యవహరించడంతో విలువైన స్థలాలు కబ్జాదారుల కోరల్లో చిక్కుకుంటున్నాయి. తూకివాకం పంచాయతీలో ఆక్రమణల పర్వం ఇదీ.


