తిరుపతి క్రైం : అంతర్రాష్ట్ర మొబైల్ దొంగను తిరుపతిలో అరెస్టు చేసినట్లు ఏఎస్పీ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. నిందితుడి వద్ద నుంచి సుమారు రూ.6 లక్షల విలువైన ఎనిమిది ఖరీదైన స్మార్ట్ ఫోన్లు, బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ కథనం మేరకు.. నేపాల్ దేశం బఝంగ్ జిల్లా, మయపటగాం గ్రామానికి మహేష్ బహదూర్ జటారా అలియాస్ సంతోష్ తాప అలియాస్ డాబా మహేష్ కుమార్ (29) రాత్రి వేళల్లో పెద్ద షాపింగ్ మాల్స్‌ను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ (క్రైమ్స్) ఆర్ల శ్రీనివాసులు పర్యవేక్షణలో తిరుపతి పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇస్కాన్ ఆలయం సమీపంలో నిందితుడిని అరెస్తు చేశారు. నిందితుడి వద్ద నుంచి శాంసంగ్, వీవో, ఒప్పో, వన్‌ప్లస్ బ్రాండ్లకు చెందిన ఖరీదైన స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


