డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీకి 54 వినతులు | - | Sakshi
Sakshi News home page

డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ సీఎండీకి 54 వినతులు

May 12 2026 5:36 AM | Updated on May 12 2026 5:36 AM

● చెరువులో దూకి వ్యక్తి మృతి

తిరుపతి రూరల్‌: ఏపీఎస్పీడీసీఎల్‌ కార్పొరేట్‌ ఆఫీసులో సోమవారం నిర్వహించిన ‘డయల్‌ యువర్‌ ఏపీఎస్పీడీసీఎల్‌ ిసీఎండీ’ కార్యక్రమానికి 54 వినతులు అందినట్లు ఆ సంస్థ సీఎండీ శివశంకర్‌ లోతేటి తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వినియోగదారులు తమ విద్యుత్‌ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్‌ శాఖ టోల్‌ ఫ్రీ నంబర్లు 1912 లేదా 1800 425 155333కు కాల్‌ చేయడం లేదా వాట్సాప్‌ నంబరు 9133331912కు చాట్‌ చేయడం ద్వారా విద్యుత్‌ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

యువకుడి మృతి

తొట్టంబేడు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తొట్టంబేడు పోలీసుల కథనం మే రకు.. నెల్లూరు జిల్లాకు చెందిన హషూబ్‌(25) డైరేడేలో సేల్స్‌ మార్కెటింగ్‌గా పనిచేస్తుంటాడు. ఇతడు వారంలో మూడు శ్రీకాళహస్తి, మూడు రోజులు సూళ్లూరుపేటలో విధులు నిర్వహిస్తూ సూళ్లూరుపేటలోని పీజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తడ వైపు ద్విచక్ర వాహనంపై వెళుతుండగా తొట్టంబేడు మండలం బీడీ కాలనీ వద్ద వాహనం అదుపు తప్పి గట్టును ఢీకొన్నాడు. స్థానికులు గుర్తించి 108లో ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇసుక డంపింగ్‌పై కేసు నమోదు

నాయుడుపేట టౌన్‌: మండలంలోని పండ్లూరు వెంగమాంబపురం సమీపంలో స్టీల్‌ ప్లాంట్‌ వెనుక అటవీ ప్రాంతంలో ఇసుక డంపింగ్‌ చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌ వెనుక ఇసుక నిల్వలు ఉండడంపై పోలీసుల విచారణలో ఓజిలి మండలం సగుటూరు గ్రామానికి చెందిన అనీల్‌ అనే వ్యక్తి ఇసుకను ట్రాక్టర్లతో తీసుకువచ్చి డంపింగ్‌ చేసి లారీల్లో తరలించేందుకు ప్రయత్నిస్తుట్లుగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. ఈ ఇసుక డంపింగ్‌పై రెవెన్యూ అధికారులతో పంచనామా నిర్వహించి ఇసుక నిల్వలను స్వాధీనం చేసుకుని అనీల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రాణం తీసిన పేకాట

నాగలాపురం: పేకాట స్థావరంపై పోలీసుల దాడితో భయపడిన జూదరి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మండలంలోని కా లంజేరి పరిసరాల్లో నాలుగు రోజులుగా కొందరు వ్యక్తులు వ్యవసాయ పొలాల మధ్య పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఎస్‌ఐ సునీల్‌ తన సిబ్బందితో కలిసి గ్రామానికి చేరుకున్నారు. పోలీసులు అర కిలోమీటర్‌ దూరం నుంచి వస్తున్నారన్న విషయాన్ని గమనించిన పేకాటరాయుళ్లు అక్కడ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరు పక్కనే ఉన్న అరణియార్‌ చెరువులో దూకగా, ఈశ్వర్‌ అనే వ్యక్తి చెరువులో చిక్కుకున్నాడు. పరిస్థితిని గమనించిన ఎస్‌ఐ సునీల్‌, కానిస్టేబుల్‌ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చెరువులోకి దిగి అతడిని రక్షించేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఈశ్వర్‌ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి ఈశ్వర్‌, నారాయణవనం మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది పేకాటారాయుళ్లు పాల్గొన్నట్లు, వీరందరు పిచ్చాటూరు, ఊత్తుకోట, నారాయణవనం మండలాలకు చెందిన వారుగా గుర్తించారు. సంఘటన స్థలానికి పుత్తూరు డీఎస్పీ రవి కుమార్‌, సత్యవేడు సీఐ మురళి నాయుడు చేరుకుని వివరాలను సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మినీ ట్రక్‌ బోల్తా

రేణిగుంట: టైర్‌ పంక్చర్‌ కావడంతో టమాట లోడ్డుతో వెళ్తున్న మినీ ట్రక్కు బోల్తాపడిన ఘటన రేణిగుంట మండలంలోని ఎల్లమండ్యం చెరువు సమీపం, పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి వంతెన పై సోమవారం చోటు చేసుకుంది. టైర్‌ పంక్చర్‌ కావడంతో అదుపుతప్పి మినీ ట్రక్కు బోల్తాపడింది. డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రక్కులోని టమాటాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కును తొలగిచి, ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement
 
Advertisement
Advertisement