రేణిగుంట: మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కంపెనీలో జరిగిన రాగి వైర్లు, కాపర్ బస్‌బార్లు ఇతర కాపర్ సామగ్రి చోరీ కేసులో తమిళనాడుకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు రేణిగుంట రూరల్ సీఐ మంజునాథరెడ్డి తెలిపారు. పోలీసుల కథనం మేరకు...
మండలంలోని ఎర్రమరెడ్డిపాళెం ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతుల కంపెనీలో జరిగిన రాగి వైర్లు, కాపర్ బస్‌బార్లు ఇతర కాపర్ సామగ్రి చోరీ జరిగినట్లు పోలీసులకు ఏప్రిల్ మొదటి వారంలో ఫిర్యాదు అందింది. ఈ ఘటనపై గాజులమండ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రూరల్ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ హరీష తమ సిబ్బందితో ముమ్మర గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, టోల్ ప్లాజా వివరాలు, సాంకేతిక ఆధారాల సహాయంతో కేసును ఛేదించిన పోలీసులు తమిళనాడు రాష్ట్రానికి చెందిన అనిత (27), సరసు (55), హిందు, ఇల్లవారాసి, మణికండన్, ఆనందబాబు, కుమార్ శబరిని తిరుపతి బ్లిస్ హోటల్ సమీపంలోని గుజిరి షాప్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు చోరీ చేసిన సొత్తును విక్రయించి, ఖర్చు చేసి, మళ్లీ చోరీలకు పాల్పడేందుకు వచ్చినట్లు అంగీకరించారు. వారి వద్ద నుంచి 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి సమర్థవంతంగా పని చేసిన పోలీసులను అధికారులు అభినందించారు.


