తిరుపతి అర్బన్: చదువుకుంటాం.. తమకు గురుకులంలో సీటు ఇప్పించి అవకాశం కల్పించండి సారూ.. అని పేద విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కోరారు. సోమవారం కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డీఆర్వో నరసింహుల ఆధ్వర్యంలో జరిగిన పీజీఆర్‌ఎస్‌లో 348 అర్జీలు వచ్చాయి. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శివశంకర్‌నాయక్, భరత్ నాయక్, రోజ్‌మాండ్, అనురాధ పాల్గొన్నారు. తమ కుమార్తె మాధురి గురుకులం స్కూల్‌లో చదువుకోవాలని అంటోంది.. మాకు అవకాశం కల్పించండి ప్లీస్ అంటూ శ్రీకాళహస్తి మండలంలోని చల్లపాళెం అరుంథతి వాడకు చెందిన దివ్యాంగులు మందా సుబ్రమణ్యం, మహాలక్ష్మి దంపతులు కోరారు. అలాగే తమ బిడ్డ కామేశ్వరికీ బిరడవాడ సాంఘిక సంక్షేమం శాఖకు చెందిన గురుకుల కళాశాలలో ఎంపీసీ సీటు ఇప్పించాలని నాయుడుపేట మండలం అన్నమేడు ఎస్సీ కాలనీకి ఎం. కామేశ్వరి కోరారు. డేటా ఎంట్రీ కరెక్షన్ కోసం తిరుపతి అర్బన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం చుట్టూ రెండు నెలలుగా తిరుగుతూనే ఉన్నా, ఉద్యోగులు పట్టించుకోవడం లేదని తిరుపతి ఆటోనగర్‌కు చెందిన జీ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి కోసం తన కూమార్తెలు తనని వేధిస్తున్నారని పెళ్లకూరు మండలంలోని చెన్నప్పనాయుడుపేట గ్రామానికి చెందిన కడూరు మునెమ్మ(84) సోమవారం కలెక్టరేట్‌లో పీజీఆర్‌ఎస్‌లో అధికారులకు ఓ వినతిపత్రం అందజేశారు.


