తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 10 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శనివారం అర్ధరాత్రి వరకు 81,512 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 38,988 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.
బర్డ్ ట్రస్ట్‌కు
రూ.10 లక్షల విరాళం
తిరుమల: గుంటూరుకు చెందిన కారుమూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ కారుమూరి శ్రీనివాసులు రెడ్డి ఆదివారం బర్డ్ ట్రస్ట్‌కు రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయక మండపంలో దాత విరాళం డీని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. టీటీడీ బోర్డు సభ్యులు నన్నపునేని సదాశివరావు పాల్గొన్నారు.
గంగజాతరకు పటిష్ట భద్రత
తిరుపతి క్రైం : తిరుపతి గంగమ్మ జాతరకు పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం నాయుడు తెలిపారు. జాతర ప్రాంగణంలో జేబుదొంగలు, గొలుసు దొంగలు సంచరించే అవకాశాలు ఉన్నందున భక్తులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు బంగారు ఆభరణాలు అధికంగా ధరించి రావద్దని, విలువైన వస్తువులను ఎల్లప్పుడూ తమ కంటికి కనిపించేలా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్‌ను సంప్రదించాలన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 100 లేదా 112 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.
స్విమ్స్ కార్మికుడు రూకేష్ ఆరోగ్యం విషమం
తిరుపతి తుడా: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రి కార్మికుడు రూకేష్ ఆరోగ్యం విషమించిందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడని సీఐటీయూ నగర ఉపాధ్యక్షుడు కే.వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్స్ కార్మికులు గత 73 రోజుల నుంచి సమస్యల పరిష్కారం కోసం ఆస్పత్రి వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఆదివారం ఆయన దీక్షా శిబిరంలో కార్మికులనుద్దేశించి మాట్లాడారు. కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై రూకేష్ ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన రూకేష్ కోలుకున్న అనంతరం తన కుటుంబ పోషణ కోసం తిరిగి విధుల్లో చేరాడని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారంపై స్విమ్స్ యాజమాన్యం, టీటీడీ అధికారులు పదేపదే హామీలు ఇస్తూ కాలయాపన చేస్తుండడం వల్ల కార్మికుల్లో తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడి పెరిగిందన్నారు. కార్యక్రమంలో స్విమ్స్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి జి రవి, నాయకులు గోపి, వెంకటేష్, మారిముత్తు, బృందా పాల్గొన్నారు.
తేనెటీగల దాడి
– 20 మందికి గాయాలు
పెనగలూరు: మండలంలోని దామనచర్ల అటవీ ప్రాంతంలో ఆదివారం తేనెటీగలు దాడి చేయడంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. మూడు 108 వాహనాలలో రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గాయపడిన వారిని తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. చిట్వేలి మండలం, గరుగుపల్లి గ్రామానికి చెందిన దాదాపు నలభై మంది దామనచర్ల అటవీ ప్రాంతంలో ఉన్న గుర్రప్పస్వామి ఆలయం వద్దకు పొంగుబాలు పెట్టుకునేందుకు వచ్చారు. ఆలయం సమీపంలో ప్రసాదాలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో చెట్టుపై ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో ఇరవై మందికి గాయాలయ్యాయి. అక్కడున్న ప్రజలు 108కు సమాచారం ఇవ్వడంతో చిట్వేలి, పెనగలూరు, నందలూరు మండలాల నుంచి 108 వాహనాలు దామనచర్ల అటవీ ప్రాంతానికి వెళ్లి గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కొంత మందికి తీవ్ర గాయాలైనటుట సమాచారం.


