సమ్మర్‌.. సంబరం | - | Sakshi
Sakshi News home page

సమ్మర్‌.. సంబరం

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

● పల్లె పాటలు, ఆటలతో కళకళలాడేవి ● ఆధునికత పేరుతో పిల్లలు నేడు దూరం

గతంలో వేసవి అంటేనే వినోదం

తిరుపతి సిటీ: సమ్మర్‌ అంటేనే సంబరం...వేసవిలో ఉష్ణోగ్రతలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నా..పిల్లలకు సమ్మర్‌ సెలవులు ఎన్నో వినోదాలను, సంబరాలను తెచ్చిపెట్టేది. నేటి ఆధునిక సమాజంలో పెద్దలతో పాటు పిల్లల జీవితం ఉరుకులు పరుగులుగా మారింది. దీంతో నేటి పిల్లలు వేసవి సెలవులను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. మూడు తరాలు వెనక్కి వెళ్లి చూస్తే... అప్పటి పిల్లలు వేసవి మళ్లీ ఎప్పుడు వస్తుందా అంటూ ఎదురు చూసేవాళ్లు.. వేసవి సెలవులపై కొందరు అధ్యాపకులు, అధికారులు, విశ్రాంత ఉద్యోగులను పలకరిస్తే తమ చిన్నతనంలో వేసవి సెలవులను ఎలా గడిపారో గుర్తుచేసుకుంటున్నారు.

నీతి కథలు మనస్సును తాకేవి

మాది తిరుపతి ఎస్‌ఆర్‌పురం. నేను పాఠశాల విద్యనభ్యసించే సమయంలో వేసవి సెలవులు వస్తే తెలియని ఆనందంలో మునిగిపోయేవారం. సెలవుల్లో మా తాతగారి ఊరు చిత్తూరుకు వెళ్లేది. తాత చెప్పే నీతికథలు మనస్సును తాకేవి వీటితో పాటు శతకం పద్యాలు బోధించే వారు. చుట్టుపక్కల స్నేహితులతో క్రికెట్‌, చెస్‌, క్యారమ్స్‌ ఆడుతూ సంతోషంగా గడిపేవారం. నేడు సెల్‌ఫోన్‌లు, ఉరుకులు పరుగుల జీవితంలో నేటి బాలలకు నిజమైన వినోదాన్ని కోల్పోతున్నారు. – గోపాల్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు, తిరుపతి జిల్లా

వినోదం ఉండేది..

మా ఊరు రొంపిచెర్ల దగ్గర చిన్న పల్లెటూరు. వేసవి సెలవులు అంటే మాకు వినోదాన్ని అందించే ప్రధాన ఘట్టంగా భావించేవారం. పల్లెలోని చెరువు, బావులల్లో ఊరిలోని స్నేహితులతో కలసి స్విమ్మింగ్‌ చేసేవారం. పశువులు ఎక్కువగా ఉండటంతో వాటితో రోజంతా గడుపుతూ మైదానాలలో మేత కోసం తీసుకెళ్లి ఊరిలోని పిల్లలతో గోళీల ఆటలు, అష్టాచెమ్మ, కబడ్డీ ఆటలు ఆడేవాళ్లం. పెద్దలంటే గౌరవంతో కూడిన భయం ఉండేది. తల్లిదండ్రులు, అవ్వా తాతల వద్ద ఎంజాయ్‌ చేసేవాళ్లం. ప్రస్తుతం పిల్లలది 24 గంటలు పలు కోచింగ్‌లతో మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు.

– రామకృష్ణారెడ్డి, రిటైర్డ్‌ టీచర్‌, తిరుపతి

ఆ రోజులు మరుపురానివి

మాది తిరుపతి. చిన్నతనంలో వేసవి సెలవుల్లో మా అమ్మమ్మ ఊరు విజయపురం వెళ్లే వాళ్లం. ఊరులోని బంధుమిత్రుల పిల్లలతో చెరువులో స్విమ్మింగ్‌ చేయడం, మామిడి తోటలో మామిడిపళ్లు తినడం, సాయంత్రం అందరం ఒక చోట చేరి కబుర్లు చెప్పుకోవడం చేసేవాళ్లం. అమ్మమ్మతో పాటు ఇంటిలోని పెద్దలు నీతికథలు, మహాభారతంలోని కీలక ఘట్టాలను ఆకట్టుకునే విధంగా కథలుగా చెప్పి వినిపించేవారు. ఆ రోజులు మరువలేం. – డాక్టర్‌ సి భువనేశ్వరి, ప్రిన్సిపల్‌,

ఎస్పీడబ్ల్యూ జూనియర్‌ కళాశాల, తిరుపతి

వేసవి సెలవుల కోసం ఎదురు చూసేవాళ్లం

ప్రాథమిక విద్య నభ్యసించే రోజుల్లో వేసవి సెలవులు ఎప్పుడు వస్తాయా అంటూ ఎదురుచూసే వాళ్లం. మాది తిరుపతి మా అమ్మమ్మ వాళ్లది నెల్లూరు దగ్గర ఓ పల్లెటూరు. అమ్మమ్మ రుచికరమైన వంటలు వండిపెట్టేది. అప్పుడు చైనీస్‌, జంక్‌ ఫుడ్స్‌ లేవు. ఆరోగ్యం ఎంతో బాగుండేది. గుడుమూతలు, అష్టాచెమ్మ, బారకట్ట, మేక పులి వంటి ఆటలతో సంతోషంగా గడిపేవాళ్లం. ప్రస్తుతం అంతా యాంత్రికంగా మారింది.

– శకుంతలాదేవి, రిటైర్డ్‌ కేంద్రప్రభుత్వ అధికారి, తిరుపతి

Advertisement
 
Advertisement
Advertisement