కార్డుదారులకు కరువైన కందిపప్పు
ఖాళీగా ఉన్న డీలర్ల భర్తీలో జాప్యం
తిరుపతి అర్బన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదోడి సూపర్ మార్కెట్‌గా పిలుచుకుంటున్న చౌక దుకాణాల్లో బియ్యమే దిక్కుగా మారింది. రేషన్ కార్డుదారులకు కందిపప్పు జాడే కరువైంది. కందిపప్పు ధరలు మార్కెట్‌లో ఎక్కువగా ఉండడంతో సామాన్య, పేద ప్రజలు కొనుగోలు చేయలేక చౌక దుకాణాల్లో అందుబాటులోకి అవస్థలు పడుతున్నారు. 23 నెలలుగా బియ్యంతోనే సరిపెట్టేస్తున్నారు. అప్పుడప్పుడూ అరకొర చక్కెర మాత్రమే ఇస్తున్నారు.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రేషన్ దుకాణాల్లో బియ్యంతోపాటు చక్కెర, గోధమ పిండి, రాగిపిండి, రాగులు , కందిపప్పు తదితర వస్తువులను పంపిణీ చేశారు. చిరుధాన్యాలు సైతం కార్డుదారులకు ఇవ్వాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. అయితే రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో కార్డుదారులకు చౌకదుకాణాల్లో సరుకులు కరువయ్యాయని పలువురు కార్డుదారులు వాపోతున్నారు. పౌరసరఫరాలశాఖా మంత్రి నాదేండ్ల మనోహర్ గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చౌకదుకాణాల్లో అన్ని రకాల సరుకులు ఇవ్వడంలేదని.....తమ ప్రభుత్వంలో కార్డుదారులకు అవసరమైన అన్ని సరుకులను పంపిణీ చేస్తామని హామీలు ఇచ్చినప్పటికీ అమల్లోకి తీసుకురాకపోవడంతో పలువురు మండిపడుతున్నారు. దానికితోడు జిల్లాలోని 369 ఎండీయూ వాహనాలను రద్దు చేశారు. ఇంటింటికీ వెళ్లి సరుకులు ఇచ్చే సౌకర్యం లేకుండా పోయింది. గతంలో ప్రతి నెలా 1వ తేదీ నుంచి 18 వరకు సరుకులు ఇచ్చేవారు. ప్రస్తుతం 1 నుంచి 15 వరకు మాత్రమే ఇచ్చేలా కుదింపు చేశారు. మూడు రోజుల పాటు కుదింపు చేయడంతో కార్డుదారులు అవస్థలు పడుతున్నారు.
266 మంది డీలర్ల కొరత
జిల్లాలో 1457 చౌక దుకాణాలు ఉన్నాయి. అయితే పలువురు డీలర్లకు రాజకీయ రంగు పులమడంతో పాటు వైఎస్సార్‌సీపీకి చెందిన డీలర్లు అంటూ పలువురిని ఒత్తిడి చేసి రాజీనామా చేయించారు. రాజీమానా చేయకుంటే కేసులు పెడుతామని చెప్పడంతో 266 మంది రేషన్ షాపులను వదిలిపెట్టేశారు. ఆ తర్వాత ఆ షాపులను కూటమి ప్రభుత్వానికి చెందిన వారికి ఇస్తామని చెప్పారు. అయితే మూడు పార్టీల్లో సమన్వయం లేకపోవడంతో 20 నెలలుగా వాటిని భర్తీ చేయకుండా కొందరు పొదుపు సంఘాలకు, పక్క డీలర్లకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే ఇన్‌చార్జిలు సక్రమంగా బియ్యాన్ని ఇవ్వడం లేదనే విమర్శలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
చౌక దుకాణాల్లో
23 నెలలుగా అదే తంతు


