ఇసుక లారీ మాయం? | - | Sakshi
Sakshi News home page

ఇసుక లారీ మాయం?

May 11 2026 9:37 AM | Updated on May 11 2026 9:37 AM

నాయుడుపేట టౌన్‌: మండల పరిధిలోని పండ్లూరు వెంగమాంబపురం అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది నుంచి ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక డంపింగ్‌ చేసి పొట్టులారీ బస్తాల మాటున ఇసుకను తరలింపు చేస్తుండడంపై గ్రామస్తులు ఐదు రోజుల కిందట పోలీసులకు సమాచారం అందించారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలం వద్దకు చేరుకోవడంతో ఇసుక లోడింగ్‌కు సిద్ధమవుతున్న లారీ డ్రైవర్‌తో పాటు క్లీనర్‌లు లారీని వదిలి పరారయ్యారు. దీంతో పోలీసులు లారీ టైర్లకు గాలితీసివేసి లారీ యజమాని ఎవరనే కోణంలో విచారణ చేపట్టారు. అయితే అధికార పార్టీ నేతల అండదండలతో పొట్టు బస్తాల మాటున తమిళనాడుకు అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు గ్రామస్తులు కనుగొని అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు పట్టుకున్న లారీని ఎందువల్లనో ఐదు రోజులుగా ఇసుక డంపింగ్‌ చేసి ఉన్న ప్రాంతంలోనే నిలిపి వేసి ఉంచారు. ఈ క్రమంలో ఆదివారం అక్కడ ఉన్న లారీ మాయం కావడంతో గ్రామస్తులు అవాక్కయ్యారు. పోలీసులు కేసు కట్టి తీసుకువెళ్లారా.. లేక అధికారపార్టీ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి లారీని వదలేశారా అంటూ ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. ఈ విషయమై నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబును వివరణ కోరగా ఇసుక అక్రమ రవాణాకు ప్రయత్నించిన లారీపై కేసు నమోదు చేస్తున్నామని చెప్పారు. అయితే ఇక్కడ లారీయే లేదని మాయమైన విషయం చెప్పడంతో డీఎస్పీ సైతం అవాక్కయ్యారు. ఈ విషయమై సీఐతో మాట్లాడి పరిశీలించి చర్యలు చేపడుతామని డీఎస్పీ వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement